KTR | ప్రజలను కించపరిచేలా మాట్లాడొద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పార్టీ పుట్టిన నాడు మొదటి సమావేశం జరిగింది. ఆ నాడు ఉద్యమానికి ఊపిరిలూదింది.. ఊపిరిపోసింది ఇదే కరీంనగర్ గడ్డ. ఎస్సారార్ కాలేజీలో ఆ నాడు 2లక్షల పైచీలుకు తెలంగాణ ప్రజలు కదిలివచ్చి.. తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది.. తెలంగాణ నినాదం సజీవంగా.. తెలంగాణ రావాలన్న కోరిక బలంగా ఉందని దేశం మొత్తానికి చాటిచెప్పిన సందర్భం సింహగర్జన’ అన్నారు.
‘2001లో ఉద్యమానికి ఊపిరిపోసినా.. 2006లో మళ్లీ పునర్జన్మనిచ్చినా ఇదే కరీంనగర్ గడ్డపై ఆ నాడు 2లక్షల ఓట్ల మెజారిటీతో కేసీఆర్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించింది. మళ్లీ దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పింది కరీంనగర్ గడ్డ గొప్పతనమే. 2009లో ఆశలు లేవు.. అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి.. 45 సీట్లలో పోటీ చేస్తే పది సీట్లే గెలిచింది.. అయిపోయింది కేసీఆర్, టీఆర్ఎస్ పని.. తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మరోసారి అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని 2009 నవంబర్ 29న అల్గునూర్‌లో అగ్గి అంటించింది ఇదే కరీంనగర్ గడ్డ అనేమాట మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కరీంనగర్ నిరాహార దీక్షలో అల్గునూర్‌లో ఆయన అరెస్టు కాగానే తెలంగాణ అంతా అగ్గి అంటుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. చిత్రవిచిత్రమైన అనుభవాలు. మొన్న జరిగిన ఎన్నిక డిసెంబర్ 3న వచ్చిన ఫలితం.. హతాశయులయ్యే పరిస్థితి కాదు. ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదు’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
‘సోషల్ మీడియా భావోద్వేగంతో ఉంటరు. ఉద్యమ పార్టీగా.. ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్లు.. తర్వాత వచ్చిన తమ్ముళ్లకు తెలంగాణతో, కేసీఆర్, పార్టీతో భావోద్వేగపూరిత అనుబంధం ఉంటుంది. కొందరిని చూసిన ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాం కానీ.. నాయకులను మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొందరు పోస్టులు పెట్టారు. నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నా.. ఇలాంటి భావోద్వేగపూరిత మాటలు ప్రజలను కించపరిచేలా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డరు. అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏం లేని నాడు.. 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు.. మజిల్ పవర్ లేదు.. మనీ పవర్ లేదు. మీడియా పవర్ లేదు. ప్రత్యర్థులకు కొదవ లేదు. ఏం లేనినాడు కూడా కేసీఆర్‌ను ఎత్తిన పెట్టుకున్నది.. గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు.. నడిపించింది అదే ప్రజలని మరిచిపోవద్దు. ఒక్కసారి 1.85శాతం తేడాతో మనపై చిన్నపాలి అలకచూపెడితే దానికి ప్రజలను నిందించడం సోషల్ మీడియాలో మంచిది కాదు. ఇలాంటి పనులు చేయొద్దు’ అంటూ సూచించారు.
‘తెలంగాణ ప్రజల మనసు మళ్లీ తిరిగి ఎట్ల గెలుచుకుందాం.. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఎట్లా జెండా పాతుదాం.. మళ్లీ ఎట్ల గులాబీ జెండా ఎగురవేద్దామనే దిశగా ఆలోచిద్దాం పొరపాటున కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించేలా మాట్లాడొద్దు. గెలుపుతోని పొంగిపోవద్దు.. ఓడిపోతే కుంగిపోవద్దని మన నాయకుడు కేసీఆర్ చెబుతారు. ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమయి బాలకిషన్, గోరెటి వెంకన్న, వరంగల్ శీనులాంటి వారితో కూర్చొని పాటలు రాసేది. అందులో ఒక అద్భుతమైన పాట రాశారు. ‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందని.. అనుకుంటే వచ్చేదా? దేశానికి స్వాత్రంత్య్రం’. 1857లో తొలిసారి బ్రిటిష్ వారిపై మర్లపడితే కర్కషంగా తొక్కిపడేశారు. దాన్నే సిపాయిల తిరుగుబాటు అంటారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని భారతదేశంలోని స్వాతంత్య్ర ఉద్యమకారులు అయ్యో.. ఇక మాతోని కాదు అని ఎక్కడోల్లక్కడ దుప్పటి కప్పుకొని పడుకుంటే దేశానికి స్వాతంత్య్రం వస్తుండెనా?. అట్లగే రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది? అని కేసీఆర్ ఆ నాడే పిడికిలి బిగించి.. కవులు, కళాకారులతో పాటలు రాయించి.. స్వయంగా కూర్చోని ఈ పాటలకు మెరుగులుదిద్దిన పరిస్థితి’ అని కేటీఆర్ గుర్తు చేశారు.