ములుగు, సెప్టెంబర్16 (నమస్తేతెలంగాణ) : ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మైదం మహేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్ కుటుంబానికి రూ.5.5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు మంగళవారం మాధవరావుపల్లిలోని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ.. మహేశ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా వేతనాలు రాకపోవడంతో మనస్తాపం చెంది ఈ నెల 3న మహేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి కుటుంబ సభ్యులను ఈనెల 7న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు మంగళవారం మహేశ్ కుటుంబ సభ్యులకు రూ.5.50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు ద్వారా పంపించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ.. ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నెలల కొద్ది జీతాలు ఇవ్వకపోవడంతో మనోవేదనతో కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖలో కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. స్థానిక మంత్రి సీతక్క, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే మహేశ్ ఆత్మహత్య ఘటన చోటు చేసుకున్నదని విమర్శించారు.