WEF | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన ద్వారా వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సాధించిన విజయాలను వినేందుకు ఆసక్తిగా ఉన్నామని ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యూటీఎఫ్) అధ్యక్షుడు బోర్గేబ్రెండే అన్నారు. చైనాలోని టియాంజిన్‌లో జూన్ 27 నుంచి 29 వరకు జరగనున్న 14వ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) న్యూ చాంపియన్స్ వార్షిక సదస్సులో పాల్గొనాలని ఆహ్వానిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు ఆయన లేఖ రాశారు. ‘మీ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో అగ్రగామిగా ఎదిగింది’ అని బ్రెండే తన ఆహ్వాన లేఖలో మంత్రి కేటీఆర్‌ను కొనియాడారు.
టీ-హబ్ వంటి విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం స్టార్టప్స్, ఆవిష్కరణల్లో అగ్రగామిగా మారిందని ఆయన ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎన్డీఆర్సీ) మద్దతుతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్-ది డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ’ అనే థీమ్‌ను ఖరారుచేశారు. వాణిజ్యం, ప్రభుత్వం, పౌర సమాజం, అంతర్జాతీయ సంస్థలు, విద్యా సంస్థలకు చెందిన దాదాపు 1500 మంది ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.
ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ను వేగవంతం చేయడం, వాతావరణం, సుస్థిరత వంటి అంశాల్లో పురోగతి సాధించడం, ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా తగిన విధానాలను అమలుచేయడం, కొవిడ్ మహమ్మారి అనంతరం వచ్చిన మార్పులు తదితర అంశాలపై సదస్సు దృష్టి సారించనున్నది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ మార్పుల వంటి అంశాలపై ఏటా డబ్ల్యూఈఎఫ్ న్యూ చాంపియన్స్ సదస్సును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.