హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద ఈవెంట్‌గా పేరున్న ‘ది ఇండస్ అంత్రప్రెన్యూర్స్’ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక టైకాన్ సదస్సుకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వచ్చే నెల 4, 5 తేదీల్లో కొచ్చిన్‌లోని గ్రాండ్ హయత్‌లో జరిగే ఈ సదస్సుకు ఆయనను గెస్ట్ ఆఫ్ హానర్‌గా ఆహ్వానించారు. వివిధ రంగాల సీఈవోలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమల నిపుణులు దేశ, విదేశాల నుంచి సదస్సుకు హాజరుకానున్నారు. ఈ ఏడాది ‘మిషన్ 2030 – ట్రాన్స్ఫార్మింగ్ కేరళ’ థీమ్‌తో కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునికరించేందుకు అవసరమైన ప్రణాళికలు, వ్యూహాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
డిసెంబర్ 5న సాయంత్రం జరిగే టైకాన్ అవార్డ్స్, ముగింపు వేడుకలకు కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ చూపిన చొరవ, నాయకత్వం, ఆవిష్కరణలు, అంత్రప్రెన్యూర్షిప్లను పెంపొందించడంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన వ్యూహాలు సదస్సులో పాల్గొనే వారికి స్ఫూర్తిని కలిగిస్తాయని, కేటీఆర్ రాక ద్వారా ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని, యువ ఆంత్రప్రెన్యూర్స్‌కు ప్రేరణ కలిగిస్తుందని టై కేరళ అధ్యక్షుడు జాకబ్ జోయ్, టైకాన్ కేరళ-2024 చైర్మన్ వివేక్ కృష్ణ గోవింద్ అభిప్రాయపడ్డారు. టైకాన్ 24 ఆహ్వాన పత్రికను టై గ్లోబల్ బోర్డ్ ట్రస్టీ వైస్ చైర్మన్ మురళీ బుక్కపట్నం, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలతో కలిసి ఆదివారం కేటీఆర్‌కు అందజేశారు.