రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసులతో ఎట్టకేలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్లూమ్ పరిశ్రమలకు భారీ ఊరట కలిగింది. 25 హెచ్‌పీలోపు సామర్థ్యమున్న పవర్లూమ్, ఎస్ఎస్ఐ యూనిట్లను క్యాటగిరీ-3 నుంచి క్యాటగిరీ-4లోకి మార్చి విద్యుత్తు సబ్సిడీ అందేలా చూస్తామని జిల్లా ఎస్ఈ భిక్షపతి ప్రకటించారు. పవర్లూమ్ పరిశ్రమలకు విద్యుత్తు సబ్సిడీలను కొనసాగించాలని, అందులో భాగంగా 30 హెచ్‌పీలోపు సామర్థ్యమున్న యూనిట్లను క్యాటగిరీ-4లో చేర్చాలని కేటీఆర్ గత సెస్ బహిరంగ సభలో ఈఆర్సీ చైర్మన్‌కు సూచించడంతోపాటు ఇదే విషయమై ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలపై ఉన్న రూ.38 కోట్ల బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జీలను రద్దు చేయాలని కోరారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి సెస్‌ను ఆధీనంలోకి తీసుకున్న టీజీఎన్పీడీసీఎల్ అధికారులు.. 25 హెచ్‌పీలోపు సామర్థ్యమున్న పవర్లూమ్ యూనిట్లతోపాటు చిన్న పరిశ్రమ (ఎస్ఎస్ఐ)లను సైతం క్యాటగిరీ-4లోకి మార్చి విద్యుత్తు బిల్లులు అందజేస్తామని వెల్లడించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం 5 నుంచి 25 హెచ్‌పీ సామర్థ్యమున్న పవర్లూమ్ పరిశ్రమలకు సబ్సిడీ పెంచడంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం ఉపాధి పొందారు. ప్రభుత్వ ఆర్డర్లతోపాటు బతుకమ్మ చీరలు, ప్రైవేట్ ఆర్డర్లతో రంది లేకుండా పనిచేసుకున్నారు. కానీ, ఎస్ఎస్ఐ యూనిట్లకు విద్యుత్తు సబ్సిడీ ఇవ్వకూడదని 2022లో ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో క్యాటగిరీ-3 కింద సబ్సిడీ వర్తించదని తీర్పు వచ్చింది.
ఆ క్రమంలో 2016 నుంచి 2024 వరకు బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జీ కలిపి రూ.19 కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నట్టు సెస్ అధికారులు తేల్చడంతో 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై భారం పడింది. దీంతో పలు యూనిట్లు మూతబడ్డాయి. ప్రస్తు తం సర్‌చార్జీతో కలిపి బకాయిలు రూ.38 కోట్లకు చేరాయి.