Minister KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్లవాసుల విడుదల కోసం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు అమెరికా నుంచి దుబాయ్ చేరుకున్న కేటీఆర్ బుధవారం భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్‌తో సమావేశమయ్యారు. ఖైదీల నేరంతో నష్టపోయిన నేపాల్ బాధిత కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారాన్ని షరియా చట్టం ప్రకారం దియా రూపంలో అందించామని తెలిపారు. ఆ తరువాత 2013లోనే నేపాల్ విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని క్షమాభిక్షకు అవసరమైన అన్ని రకాల పత్రాలను దుబాయ్ ప్రభుత్వానికి భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం ద్వారా అందించామని గుర్తుచేశారు. అయినప్పటికీ ఇంతవరకు ఖైదీల విడుదల అంశం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుదీర్ఘకాలం శిక్ష అనుభవించి, జైలు అధికారుల ద్వారా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా పేరొందిన సిరిసిల్ల వాసులకు వెంటనే క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు.
రాజు తలచుకుంటేనే క్షమాభిక్ష
అనంతరం మంత్రి కేటీఆర్ దుబాయ్ కాన్సుల్ జనరల్‌గా వ్యవహరిస్తున్న రామ్‌కుమార్‌తో పాటు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్, బాధిత కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు, పలువురు తెలంగాణ ఎన్నారైలతో ప్రత్యేకంగా సమావేశమై ఖైదీల క్షమాభిక్ష ప్రక్రియ పురోగతి గురించి తెలుసుకున్నారు. దుబాయ్ రాజు క్షమాభిక్ష ప్రసాదిస్తేనే విముక్తి లభిస్తుందని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు జరిగిన బిజినెస్ సమావేశాల సందర్భంగా రాజ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్న పలువురు వ్యాపార వేత్తలతోను వీరి గురించి మంత్రి ప్రస్తావించి, క్షమాభిక్ష కోసం సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన వారంతా దుబాయ్ ప్రభుత్వంతో స్థానిక చట్టాల మేరకు చర్చించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ
షరియా చట్టం ప్రకారం బాధిత కుటుంబం బ్లడ్ మనీ (దియా) తీసుకొని క్షమాపణ పత్రం అందిస్తేనే నిందితులను విడుదల చేస్తారు. దియా అనగా బాధిత కుటుంబానికి చెల్లించే ఆర్థిక నష్టపరిహారం. యూఏఈ చట్టాల మేరకు మంత్రి కేటీఆర్ రూ.15లక్షల పరిహారాన్ని బాధితుడి కుటుంబం అంగీకారం మేరకు 2013లోనే స్వయంగా నేపాల్‌కు వెళ్లి వారికి ఇచ్చారు. వారితోనే క్షమాభిక్ష పత్రాన్ని రాయించి దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించారు. కానీ నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు క్షమాభిక్షకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో దుబాయ్ రాజు క్షమాభిక్ష పెడితేనే జిల్లా వాసులకు విముక్తి లభించే అవకాశాలుండటంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషి
బతుకు దెరువు కోసం పొట్ట చేతపట్టుకుని భార్యాపిల్లలను వదిలి దుబాయ్‌కి వెళ్లిన రాజన్న సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశం, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు 2005లో నేపాల్‌కు చెందిన దల్ ప్రసాద్ రాయ్ మరణం కేసులో దోషులుగా ఖరారై జైలులో పడ్డారు. వారి కుటుంబ సభ్యులు తమ వారిని విడిపించాలని మంత్రి కేటీఆర్‌ను కలిసి చాలాసార్లు మొరపెట్టుకున్నారు. చలించిన కేటీఆర్, ‘తెలిసీ తెలియక చేసిన తప్పిదం ఏదైనా కావచ్చు’ అని వారిని విడిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.