
ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రక్షణశాఖే అడ్డంకి: మంత్రి కేటీఆర్
వంతెనల కోసం భూములిచ్చేందుకు నిరాకరణ
ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతీసుకోవాలి
రాష్ట్ర పురపాలక, ఐటీశాఖమంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో షేక్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభం
జేబీఎస్ నుంచి తుర్కపల్లి వరకు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు రక్షణశాఖ భూములు కేటాయించాల్సి ఉన్నది. భూములు
ఇవ్వాలని ఆరేండ్లుగా కోరుతున్నా, కేంద్రం నిరాకరిస్తున్నది. ప్రజావసరాల కోసం రక్షణశాఖ భూములను ఉత్తరప్రదేశ్‌లో ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు ఇచ్చే విషయంలో మాత్రం మొండికేస్తున్నది. -మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో/కొండాపూర్, జనవరి 1: ప్రజావసరాల కోసం రక్షణశాఖ భూములను ఉత్తరప్రదేశ్‌లో ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు ఇచ్చే విషయంలో మాత్రం మొండికేస్తున్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని పలుమార్లు కేంద్రానికి విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకోసం గత ఆరేండ్లలో ఆరుగురు మంత్రులను కలిసి విన్నవించినా స్పందన లేదని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి శనివారం మంత్రి కేటీఆర్ షేక్‌పేట ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు అడ్డంకిగా మారిన రక్షణశాఖ భూముల అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే వరంగల్ మార్గంలో ఉప్పల్-నారపల్లి మధ్య స్కైవే నిర్మిస్తుండగా, ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు.. జేబీఎస్ నుంచి తుర్కపల్లి వరకు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వీటికి రక్షణశాఖ భూములు కేటాయించాల్సి ఉన్నదని చెప్పారు. దీనిపై గత ఆరేండ్లలో పలుమార్లు విన్నవించినా.. ఆ భూముల అప్పగింతకు కేంద్రం నిరాకరిస్తున్నదని చప్పారు. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. అదేవిధంగా రసూల్‌పురాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం శాఖ స్థల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిష్కారం చూపాలని కోరారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రికి లిఖితపూర్వకంగా లేఖ రాశామని, మరోసారి రాసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మూసిన రోడ్లను తెరిపించండి
కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న 21 రోడ్లను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మూసివేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి రోడ్లను తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరాన్ని కలుపుతున్న ఎనిమిది జాతీయ రహదారుల విస్తరణతోపాటు పలు మార్గాల్లో స్కైవేలు సైతం నిర్మిస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటుగా పర్యాటకరంగ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు హైదరాబాద్‌కు పర్యాటక, వారసత్వ, చారిత్రక సంపదలో యూనెస్కో గుర్తింపుకు కృషి చేయాల్సిందిగా తెలిపారు. ఇస్తాంబుల్‌కు ఏమాత్రం తీసిపోనంత చారిత్రక సంపద హైదరాబాద్‌కు ఉన్నదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న రీజినల్‌రింగ్ రోడ్డు, సైన్స్ సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశంలో చిన్న వయసున్న తెలంగాణ భౌగోళికంగా పదకొండో స్థానంలో ఉండగా.. దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న రాష్ర్టాల్లో నాలుగో స్థానంలో ఉన్నదని తెలిపారు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ రాష్ట్ర అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. చిన్న వయస్సున్న కొత్త రాష్ర్టాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు.
షేక్‌పేట-రాయదుర్గం ఫ్లై ఓవర్ ప్రత్యేకతలు
పొడవు : 2.72 కిలోమీటర్లు
వెడల్పు: రెండు వైపులా రాకపోకల కోసం 6 లేన్లతో రహదారి
వ్యయం:రూ.333.55కోట్లు
4 కూడళ్లను (షేక్‌పేట నాలా-సెవన్ టూంబ్స్, ఓయూ కాలనీ, విష్పర్ వ్యాలీ-నార్నే-జేఆర్సీ కన్వెన్షన్, జూబ్లీహిల్స్-ఫిలింనగర్ కూడళ్లు) దాటుతూ నగరంలో నిర్మించిన రెండో అతి పెద్ద ఫ్లై ఓవర్.
కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్ వైపు అత్యంత కీలకమైన రహదారి మార్గంలో నిర్మించిన విశాలమైన ఫ్లై ఓవర్
ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్