KT Rama Rao | హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ వంచనతో మరోసారి ముంచిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దుయ్యబట్టారు. రైతులతో పరిహాసాలాడొద్దని హెచ్చరించారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, కంటి తుడుపు చర్యగా కేవలం 79,574 ఎకరాలకే పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పంట నష్టం అంచనాలను ప్రభుత్వం ఎందుకు ఇష్టారీతిగా మార్చివేసిందని ప్రశ్నించారు. 3.35 లక్షల ఎకరాలు ఎట్లా తగ్గిపోయాయని నిలదీశారు. అపార నష్టంతో అల్లాడుతున్న రైతులను ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా? మానవత్వం ప్రదర్శించలేరా? 5.2 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం రిపోర్ట్ ఇచ్చింది నిజం కాదా? అని సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
రైతులు పెట్టిన పెట్టుబడి కొట్టుకుపోయి, రాళ్లు, ఇసుక మేటలు వేసిన పొలాలను బాగుచేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు ఏమూలకూ సరిపోవని పేర్కొన్నారు. రుణమాఫీలో దగా జరిగిందని, రైతుభరోసా జాడా లేకుండా పోయిందని ఆఖరికి వరదలు ముంచెత్తి నష్టాలు, కష్టాలతో కూరుకుపోయిన రైతులకు అండగా నిలవాలని సూచించారు.