హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ‘రైతే రాజు అనేది రాజకీయ నినాదం కాదు..కేసీఆర్ ప్రభుత్వ విధానం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వలస బాట పట్టిన రైతుల్లో కేసీఆర్ పాలనలో సాగు అనుకూల విధానాలతో గుండె ధైర్యం నింపారని సోమవారం ఎక్స్‌వేదికగా గుర్తుచేశారు. భూమిని నమ్ముకొని తిరిగొచ్చిన రైతులకు రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించి, ఏ కారణం చేతనైనా రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా అందించి భరోసా నింపారని పేర్కొన్నారు. యూరియా, ఎరువుల కొరత రాకుండా ఉత్తరాది రాష్ర్టాల్లో డిమాండ్ లేని సమయంలో ఏప్రిల్, మేలో 4 లక్షల టన్ను లు, డీలర్ల వద్ద మరో 3 లక్షల టన్నుల బఫర్‌స్టాక్ ఉండేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. జూలై, ఆగస్టులో కేంద్రం ఇవ్వాల్సిన కోటాను సమన్వయం చేసుకుంటూ రాష్ర్టాని కి తెప్పించేవారని గుర్తుచేశారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సాగు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగంలో సంక్షోభం నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యవసాయంపై నిర్లక్ష్యం, కనీసం ఒక్కసారి కూడా సమీక్షించకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో ఇప్పుడు యూరియా, డీఏపీకి కొరత ఏర్పడిందని దుయ్యబట్టారు. రేవంత్ సర్కారు అలసత్వంతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతు లు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మాయమైన చెప్పుల లైన్లు మళ్లీ దర్శనమి స్తుండటం హస్తం పార్టీ అస్తవ్యస్త విధానాలకు అద్ధం పడుతున్నదని ధ్వజమెత్తారు. ‘ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వం..రైతు పాలన కాదు..రాక్షస పాలన’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతులకు అవసరం మేరకు యూరియా, ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.