హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన చంద్రకళ (9) తల్లిదండ్రులు చనిపోయారు. వారినే తలచుకొంటూ రాత్రింబవళ్లు ఇంట్లోనే ఉంటూ ఏడుస్తున్నది. ఆమెను ఓదార్చటం ఎవరితరం కావటం లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువుకుంటానని, ఎవరైనా స్పందించి చేయూతనివ్వాలని వేడుకొంటున్నది’ అని పత్రికలో వచ్చిన వార్తను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన.. చిన్నారికి భరోసా కల్పించారు. సాధ్యమైనంత త్వరగా ఆ అమ్మాయికి భద్రత కల్పించాలని రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖను ఆదేశిస్తూ ట్వీట్ చేశారు.