హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా మానవత్వం వెల్లివిరిసింది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మొదలు ఎందరో సాధారణ కార్యకర్తల వరకు వితరణ చాటుకున్నారు. ఎందరో అసహాయులకు ఆపన్నహస్తం అందజేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట దాతృత్వం చాటుకున్నారు. ఊరూరా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి గిఫ్ట్ ఏ ైస్మెల్ పేరిట తలసేమియా బాధితులకు అండగా నిలిచారు. రూ.3 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. గురువారం హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మాజీ ఎంపీ మాలోతు కవితతో సహా కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్ చేతుల మీదుగా తలసేమియా బాధితులైన పిల్లలకు విరాళం చెక్కును అందజేశారు.
కేటీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ఔదార్యం చాటారు. రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ సహకారంతో గిఫ్ట్ ఏ ైస్మెల్లో భాగంగా హైదరాబాద్ బోయగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ హై స్కూల్ విద్యార్థులకు 100 బెంచీలు, పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేసి వితరణ చాటారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సంతోష్‌కుమార్ చేతుల మీదుగా వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మసీఫుల్లా, బాలరాజుయాదవ్, మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, కిషోర్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు సుమిత్రా ఆనంద్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సభ్యులు రాఘవ, సతీశ్, బోజా నారాయణ, సెయింట్ ఫిలోమెనాస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ఉదయ్‌భాస్కర్, ఫాదర్ క్రాంతికుమార్, కా ర్పొరేటర్ కూర్మ హేమలత పాల్గొన్నారు.
నమస్తే నెట్వర్క్, జూలై 24: కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సామాజిక సేవలో తరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గ్రామస్థులు 100 మొకలు నాటి ప్రమాణం చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఊరూరా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రమసమయి బాలకిషన్, బోయినపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన నిరుపేద ఇంజినీరింగ్ విద్యార్థి కొండని ఆశిష్‌కు నాగారానికి చెందిన సాయినాథ్‌గౌడ్ ల్యాప్‌ట్యాప్ అందించారు.
రామగుండం నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీపికబురు అందజేశారు. కేటీఆర్ పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా గోదావరిఖని తిలక్‌నగర్‌లోని విశ్వం కమ్యూనిటీ హాలును తెలంగాణ కమ్యూనిటీ భవనంగా మార్చి, ప్రజలకు అంకితం చేశారు.
వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ నాయకుడు వ్యాల్ల హరీశ్‌రెడ్డి వితరణ చాటుకున్నారు. వివిధ కారణాలతో మృతిచెందిన 19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో రూ.10 వేల చొప్పున రూ.1.90 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేక్ కట్ చేశారు. వనపర్తిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేత బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గ్రంథాలయానికి గిఫ్ట్ ఏస్మైల్లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత రాజారాం యాదవ్ కంప్యూటర్లను వితరణ చేశారు. కాటారానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని గంట జ్యోత్స్న చదువుకయ్యే అన్ని ఖర్చులను తాము భరిస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ భరోసా ఇచ్చారు. వరంగల్‌లోని రీజినల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సన్నద్ధవుతున్న నిరుద్యోగులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి స్టడీ మెటీరియల్, స్టడీ ప్యాడ్లు, లైబ్రరీకి కుర్చీలు, ఫ్యాన్లను అందజేశారు. భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దంపతులు మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి సహకారంతో హెల్మెట్లను పంపిణీ చేశారు.
బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గంగిపల్లి రాజశేఖర్, కవిత దంపతులు కేటీఆర్‌పై అభిమానంతో మూడు నెలల వయసున్న తమ కుమారుడికి ‘కేటీఆర్’ అని నామకరణం చేశారు. గురువారం కేటీఆర్ పుట్టినరోజున ఆయన పేరు పెట్టుకున్నామని ఆ దంపతులు తెలిపారు. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారికి కేసీఆర్ కిట్టును అందజేశారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద దాదాపు 200 మందికి కేసీఆర్ కిట్లను అందజేశారు.