హైదరాబాద్, మార్చి 19 (నమస్తేతెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ముందు అఫిడవిట్లు ఇచ్చి..దేవుళ్ల మీద ఒట్టేసి మరీ ఓట్లేయించకున్న కాంగ్రెస్, బడ్జెట్ సాక్షిగా ఆరు గ్యారెంటీలకు పాతరేసిందని, అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో అబద్ధాల జాతర నడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రంగాలను దివాలా తీయించి ప్రతివర్గానికీ వెన్నుపోటు పొడిచిందని మం డిపడ్డారు. ఇది కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, కష్టాలు తెచ్చేదని విమర్శించారు.
బుధవారం శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కనబెట్టి, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఢిల్లీకి మూటలు పంపడంపైనే దృష్టి పెట్టిందని దుయ్యబట్టారు. ప్రజలను కష్టాల్లో ముం చుతూ పార్టీ కార్యకర్తలకు మాత్రం ప్రజాధనాన్ని దోచిపెట్టే కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. పంటలు ఎండిపోయి అన్నదాతలు.. కడుపులు నిండక గురుకులాల విద్యార్థులు ఆత్మహత్యలు 3వ పేజీలో
చేసుకుంటుంటే సర్కారు మాత్రం అందాల పోటీల పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభలో ప్రతిపక్షాలపై రంకెలు వేసిన రేవంత్‌రెడ్డి, బడ్జెట్లో అంకెల గారడీతో ప్రజలను మోసం చేశారని నిప్పులు చెరిగారు.
20 శాతం కమీషన్లను 40 శాతానికి పెంచుకొనేందుకే బడ్జెట్లో తప్పుడు లెక్కలు చెప్పారని కేటీఆర్ ఆక్షేపించారు. ఫ్రీబస్సుతో ఇబ్బందులు పడుతున్న 8 లక్షల మంది ఆటోకార్మికుల గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమని వాపోయారు. 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఆటోకార్మికుల సంక్షేమ బోర్డుకు అతీగతీలేకుండా పోయిందని చెప్పారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని అశోక్‌నగర్ సాక్షిగా రేవంత్, రాహుల్ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి, ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాల భర్తీకి అన్నీ సిద్ధం చేస్తే.. అభ్యర్థుల చేతికి కాగితాలిచ్చి కాంగ్రెస్ సర్కారు తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు.. కేవలం ఏడు వేల ఉద్యోగాలిచ్చిన రేవంత్‌రెడ్డి..పదే పదే 57 వేల కొలువులిచ్చామని అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసం?’ అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అశోక్‌నగర్ చౌరస్తా వేదికగా నిరూపించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని, దమ్ముంటే రాహుల్, రేవంత్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఉద్యోగులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి కేసీఆర్ న్యాయం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగులకు పీఆర్సీతో పాటు 5 డీఏలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం బడ్జెట్లో ఆ ఊసే మరిచిందని విమర్శించారు. కులగణన పేరిట బీసీల సంఖ్యను తగ్గించి పచ్చి మోసం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్లై ఓవర్లు నిర్మించి..రోడ్లు వేయించి అందంగా తీర్చిదిద్దిన హైదరాబాద్‌ను అధ్వానంగా చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. మొత్తంగా బడ్జెట్‌ను చూస్తే రేవంత్‌రెడ్డి అనుభవలేమి, పాలనావైఫల్యానికి నిలువుటద్ధంలా కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. యువ వికాసం ముసుగులో రూ. 6వేల కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాపం రైతన్నలకు శాపంగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చేతకాని సర్కార్.. చేవలేని సీఎం’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి ఎండలే కారణమని రేవంత్ పేర్కొనడం తన అవగాహనా రాహిత్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ సర్కార్ వల్లే పంటలు ఎండుతున్నాయని తేల్చిచెప్పారు. ఎండిన వరిపైరుతో అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపిన అనంతరం కేటీఆర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం వల్లే రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని, అందుకు ప్రభుత్వం ఎండిపోయిన ప్రతి ఎకరాకూ రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని, ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్నివిధాలుగా వెన్నుదన్నుగా ఉన్నామని, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా పలువురు నేతలు పర్యటిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వ చేతగానితనం వల్లే 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ వాపోయారు. ఓవైపు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే అందాల పోటీలు అవసరమా? అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం నీళ్లు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం బరాజ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తున్నదని, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ప్రభుత్వమే ఇసుక వ్యాపారం చేస్తున్నదని విమర్శించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పంటలు పూర్తిగా ఎండుతున్నా ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నదని మండిపడ్డారు. సాధారణ వర్షపాతం కన్నా రాష్ట్రంలో అత్యధికంగా నమోదైనా నీటిని వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కృష్ణాలో 22 శాతం నీటిని కూడా రేవంత్ ప్రభుత్వం వినియోగించలేదని, అందుకే రైతన్నలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని వాపోయారు.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల వరిపొలాలు మేకలు, గొర్లకు మేతగా మారాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం రూ. 6 కోట్లు విడుదల చేయకపోవటం వల్ల దేవాదుల కింద రూ. 600 కోట్ల పంట నష్టం జరిగిందని చెప్పారు. లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నదని వివరించారు. దేవాదుల పంపుల విషయంలో బీఆర్ఎస్ నిరసన తెలిపేదాకా ప్రభుత్వం నిద్రవీడలేదని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కుండబద్దలు కొట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా ఆటో డ్రైవర్ల నుంచి అన్నదాతల దాకా అన్ని వర్గాల వారిని దగా చేసింది. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏమోగానీ ట్రిలియన్ డాలర్ల అప్పులు తేవడం ఖాయంగా కనిపిస్తున్నది. నమ్మి ఓటేసిన పాపానికి పింఛన్లు పెంచకుండా వృద్ధులను, దివ్యాంగులను, నెలకు రూ. 2500 ఇవ్వకుండా ఆడబిడ్డలను, స్కూటీలు ఇవ్వకుండా విద్యార్థినులను, పెట్టుబడి సాయం ఇవ్వకుం డా, రుణమాఫీ చేయకుండా రైతులను, ఆత్మీయ భరోసా ఇవ్వకుండా వ్యవసాయ కూలీలను.. మద్యం దుకాణాల్లో 25 శాతం రిజర్వేషన్లను ఇవ్వకుండా గౌడన్నలను, రెండో విడత గొర్రెపిల్లలు ఇవ్వకుండా గొల్లకుర్మలను, రూ.12 లక్షల దళితబంధు ఇవ్వకుండా దళితులను ఇలా కోట్లాది మందిని నట్టేట ముంచింది.
– కేటీఆర్
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ అంటే కరోనా కంటే డేంజర్ అనే విషయం ప్రజలకు అర్థమైంది. 20 శాతం కమీషన్లను 40 శాతానికి పెంచుకొనేందుకే బడ్జెట్లో తప్పుడు లెక్కలు చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూపుదిద్దుకున్న ప్రగతి రథ చక్రానికి కాంగ్రెస్ సర్కారు పంక్చర్ చేసింది. కేసీఆర్ హయాంలో నేతన్నల అభ్యున్నతికి రూ.1200 కోట్ల బడ్జెట్ పెడితే కాంగ్రెస్ కేవలం రూ. 370 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నది.
– కేటీఆర్