రాజన్న సిరిసిల్ల, మే 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిప్పులు చెరిగారు. ‘సీఎం పదవిని, వయసును చూసేది లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడన్న సోయి మరిచి రోడ్ల మీద తిరుగుతూ కేసీఆర్‌పై అడ్డం పొడువు మాట్లాడుతున్న గాడిదలకు పదవులొచ్చేవా? కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే జీవితంలో తెలంగాణ వచ్చేదా? టీకాంగ్రెస్, టీబీజేపీ ఉండేవా? పదవులున్నాయి కాబట్టే గౌరవిస్తున్నారు. పదవులే లేకుంటే మిమ్మల్ని గంజిలో ఈగలా తీసిపడేసేటోళ్లు’ అని ప్రతిపక్షాలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన కాలి గోటికి సరిపోనోళ్లు, ఎగిరెగిరి మాట్లాడుతున్నోళ్లు దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలని హితవు పలికారు.
బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో దళితబంధు కింద రైస్‌మిల్లు, హరిదాస్‌నగర్‌లో పెట్రోల్ బంక్ నిర్మాణాలకు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం సిరిసిల్లలో సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ (సెస్) కార్యాలయంలో నూతన పాలక వర్గ పదవీ బాధ్యతల స్వీకరణోత్సవానికి రసమయి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి హాజరయ్యారు. చైర్మన్ గూడూరి ప్రవీణ్‌తోపాటు పాలకవర్గ సభ్యులను అభినందించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌లో ఎల్లమ్మ సిద్దోగానికి హాజరయ్యారు. మండల కేంద్రంలో రూ.11 లక్షలతో నిర్మించిన 16 దుకాణ సముదాయాలను మంత్రి ప్రారంభించారు.
బండలింగంపల్లిలో ‘మన ఊరు – మనబడి’ కార్యక్రమంలో భాగంగా రూ.28 లక్షలతో నిర్మించ తలపెట్టిన ఆధునిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. తెలంగాణలో చేపట్టిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు దేశంలోని 6 లక్షల పల్లెల్లో ఎక్కడైనా చూపిస్తారా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ప్రతి పనిలో చారానా, బారానా తమ పైసలే ఉన్నాయంటూ చెప్పుకొనే ఎంపీ బండి సంజయ్‌కి, మోదీ దగ్గర పతార ఉంటే రూ.1,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తేవాలని సవాల్ విసిరారు.
దేశమంతా చీకట్లు అలుముకొంటే తెలంగాణలో మాత్రం 24 గంటలు కరెంటు పవర్ ఫుల్‌గా వెలుగుతున్నదంటే దమ్మున్న కేసీఆర్ వల్లేనని కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానం చేయటానికి అరగంట కరెంటు ఇవ్వాలని అధికారులను బతిమిలాడిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఎర్రటి ఎండల్లోనూ మానేరు మత్తళ్లు దుంకుతున్నదని, వాగుల్లో నిర్మించిన చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. పూర్తిస్థాయిలో కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పుకోవడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంతో సాగు, తాగు నీటి బాధలు తప్పాయని చెప్పారు. ఆడబిడ్డల పెండ్లిళ్లలో పప్పు భోజనం పెట్టేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116 ఇచ్చి మేనమామలా కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసేది బడులేనని, అందుకే మన ఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కేటీఆర్ తెలిపారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి రూ.7,300 కోట్లు కేటాయించి అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 973 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఐదు లక్షల మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ నిధి నుంచి రూ.20 లక్షలు సాయం అందిస్తున్నామని తెలిపారు. రూ.16 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండలింగంపల్లి ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేడీసీసీ బ్యాంక్, సబ్‌స్టేషన్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ నాయకుడు చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.
దళితులు సాధికారత, స్వావలంబన సాధించి కూలీల నుంచి ఓనర్లుగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, అందులో భాగంగానే దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని విధంగా దళితబంధుకు శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా నేరుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించే పథకం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదని తేల్చి చెప్పారు. దళితబంధు పథకంలో భాగంగా చాలా జిల్లాల్లో వాహనాలు కొనుగోలు చేస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్‌మిల్లులు, పెట్రోల్ బంకులు స్థాపించేందుకు ముందుకు రావటం శుభ పరిణామమని అన్నారు.