హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్నవారి ప్రాణాలు ఆగమ్యగోచరంగా మారినా ప్రభుత్వానికి పట్టదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరమారావు మం డిపడ్డారు. ఒక అడుగు ముందుకు.. వందడుగులు వెనకి అన్నట్టుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు సాగుతున్నాయని ఆరోపించారు.
సొరంగంలో ఆక్సిజన్ అందక, కన్వేయర్ బెల్టు తెగిపోయి ఇన్నిరోజులు అవుతున్నా పనులు ముందుకుసాగకపోవడం దయనీయంగా ఉన్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ఒకట్రెం డు పిల్లర్లకు పర్రె పడ్డప్పుడు, శ్రీశైలం అగ్నిప్రమాదం జరిగినప్పుడు పిచ్చిప్రేలాపనలు, విషపురాతలు రాసిన మేధావుల నోళ్లు ఇప్పుడెందుకు మూగబోయాయి? అని ఎక్స్‌వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా కార్మికుల గోడువిని, సొరంగంలో చికుకున్నవారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.
సొరంగంలో చికుకున్నవి సాధారణ ప్రాణాలు కాదని, అవి జాతి సంపదగా గుర్తించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం ఢిల్లీ బాట పట్టడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికి 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని ఎద్దేవా చేశారు. ‘ఎస్ఎల్బీసీ సొరంగంం కూలి ఎనిమిది మంది కార్మికులు చికుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావు. మూడు నెలలుగా జీతాల్లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ఎన్నికల ప్రచారం అనంతరం తిరిగి ఢిల్లీ బాటపట్టావు’ అని సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.