KTR | తిమ్మాపూర్, సెప్టెంబర్ 5: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్‌కు వెళ్తున్న కేటీఆర్ అలుగునూరు చౌరస్తా వద్ద కార్యకర్తలకు అభివాదం చేసి కారులో బయలుదేరుతుండగా.. వెనుక డోర్ తెరిచే సమయంలో పక్క నుంచి వెళ్తున్న లారీ దానిని ఢీకొట్టింది. దీంతో కారు డోర్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో కేటీఆర్‌కు మహిళలు రాఖీలు కడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అలుగునూరు చౌరస్తా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికాయి. భారీ క్రేన్‌తో గజమాల వేసి సన్మానించారు. అనంతరం మహిళలు కేటీఆర్‌కు రాఖీలు కట్టారు. ఈ క్రమంలో కేటీఆర్ కారు వెనుక డోర్‌ను తెరిచే సమయంలో పక్క నుంచి వెళ్తున్న లారీ డోర్‌కు తగిలింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. అయితే కేటీఆర్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదంలో కారు డోర్ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ కేటీఆర్ తన పర్యటనను కొనసాగించారు. అనంతరం కాన్వాయ్‌తో కరీంనగర్‌కు బయలుదేరారు. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.