హైదరాబాద్ మే 17 (నమస్తేతెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర సాధనకు పునాది వేస్తూ కరీంనగర్ వేదికగా నిర్వహించిన తెలంగాణ సింహగర్జన సభ ఉద్యమ చరిత్రలో చెరగని సంతకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ఆ మహాఘట్టానికి శనివారం (మే 17)తో 24 ఏండ్లు నిండటం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ ఆ నాడు పూరించిన సమరశంఖం ఢిల్లీ వరకూ ప్రతిధ్వనించిన అపూర్వ సందర్భం అదేనని గుర్తుచేశారు. తెలంగాణ నలువైపుల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన జనప్రవాహం సముద్రాన్నే తలపించిన అపూర్వ సన్నివేశమని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చేదా? సచ్చేదా? అని ఆ నాడు ఎందరో అవమానించినా, అవహేళన చేసినా వెన్నుచూపని ఆ ధీరోదాత్తుడి సంకల్ప బలానికి ఆ సభే నిదర్శనమని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కేసీఆర్ ఒక్కరితో మొదలైన ఆనాటి ప్రయాణం.. అనుకున్న గమ్యాన్ని ముద్దాడటం ఒక చారిత్రక విజయమని కొనియాడారు. ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడై సాధించిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికి దారిచూపే దీపస్తంభంలా తీర్చిదిద్దిన దార్శనికత ప్రతి తెలంగాణ బిడ్డకు ఎప్పటికీ గర్వకారణమేనని పునరుద్ఘాటించారు.