జూబ్లీహిల్స్, డిసెంబర్ 23: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా సముచిత గౌరవం కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తిచేశారు. పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలని అన్నారు. పీవీ వర్థంతి సందర్భంగా శనివారం నెక్లెస్‌రోడ్డులోని పీవీ సమాధి వద్ద పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పీవీ భారతదేశానికి ఆణిముత్యం వంటివాడని, తెలుగువారికి, తెలంగా ణ రాష్ర్టానికి వన్నె తెచ్చిన నేత అని కొనియాడారు.
అప్పుల్లో కూరుకుపోయిన భారతదేశాన్ని అలనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి గాడిలో పెట్టి దేశానికి ఎనలేని సేవలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పీవీకి చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రా న్ని కోరారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల కూడా డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాలు భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద ఎత్తున నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకొని పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.