కేసీఆర్ పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగింది. అపారమైన అవకాశాలను అందించే తెలంగాణ.. తమ కలలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒకరికీ లైట్ హౌస్ లాంటిది. ఇండియాలో పెట్టుబడులు పెట్టండి.. అందులో ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ఫస్ట్ చాయిస్‌గా ఎంచుకోండి.
-లండన్‌లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్-2025 సదస్సులో కేటీఆర్
KTR | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రవాస భారతీయులను, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలురకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను పెట్టుబడులు పెట్టేందుకు ఫస్ట్ చాయిస్‌గా ఎంచుకోవాలని కోరారు. అపార అవకాశాలను అందించడంతో పాటు కలల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతిఒకరికీ తెలంగాణ ‘లైట్‌హౌస్’ లాంటిదని అభివర్ణించారు. ఇండియాతో పాటు ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి అన్నారు. లండన్‌లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్-2025లో శుక్రవారం ఆయన కీలకోపన్యాసం చేశారు. బ్రిడ్జ్ ఇండియా వీక్‌లో ఆయన ప్రసంగించడం వరుసగా ఇది రెండోసారి.
‘స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యం?’ అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లక్ష్యంగా సాగిన పాలన, ఆలోచనలు అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతోపాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కూలంకశంగా వివరించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో రోల్‌మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పోరాటాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. 2014లో ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ లేకుండా తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. 2014 నుంచి 2023 వరకు పురపాలక, పట్టణాభివృద్ధి చేనేత, టెక్స్టైల్, ఐటీ శాఖ మంత్రిగా తన అనుభవాలను, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని కేటీఆర్ విపులంగా వివరించారు.
దృఢ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందని కేటీఆర్ పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక పంథాను అనుసరించి వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పాలసీలపై తన అనుభవాలు, ఆలోచనలను కేటీఆర్ పంచుకున్నారు. సంపదను సృష్టించడంతోపాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే తమ హయాంలో తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిందని వివరించారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మధ్య అద్భుత సమతుల్యత సాధించిందని, తమ ప్రభుత్వం చేసిన ప్రగతిశీల పనులు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎవరూ చేయలేదని స్పష్టం చేశారు.
వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు హాజరైన ఈ సదస్సులో మాట్లాడిన కేటీఆర్, తలసరి ఆదాయంలో 12వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా ఎదగవచ్చో తెలంగాణను చూసి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చని చెప్పారు. తలసరి ఆదాయంలో 156 శాతం వృద్ధిని ఒక దశాబ్ద కాలంలోనే సాధించిన రాష్ట్రం తెలంగాణ ఒకటే అని తెలిపారు. 2014లో తలసరి ఆదాయంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, కేసీఆర్ ప్రగతిశీల విధానాలతో 2023 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని చెప్పారు. తమ హయాంలో పాలనను ప్రజలకు చేరువ చేయడంతోపాటు ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి వ్యక్తుల కంటే విధానాలకే ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. విప్లవాత్మక మార్పులను ఆహ్వానించడంతోపాటు నిర్ణయాధికారాలను వికేంద్రీకరించడమే తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా మార్చిందని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్‌తోపాటు ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్ కంపెనీలు అమెరికా తర్వాత తమ అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో నెలకొల్పాయని కేటీఆర్ చెప్పారు. కార్పొరేట్ సంస్థల్ని హైదరాబాద్‌కు ఆహ్వానించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించామని తెలిపారు. తాము అధికారంలోకి రావడానికి ముందు 2014లో టెక్ పరిశ్రమలో 3.23 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉండేవని, తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి అవి 10 లక్షలకు చేరాయని చెప్పారు. 2014లో రూ.56 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు, 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు.
ఇదంతా తమ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మార్గదర్శకత్వంతోనే సాధ్యమైందని అన్నారు. ఇండియా లాంటి వైవిధ్యభరితమైన దేశంలో ఒక పరిశ్రమ, సంస్థను ఏర్పాటుచేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. ఆ సంక్షిష్టతను టీఎస్ ఐపాస్‌తో తాము దూరం చేశామని అన్నారు. ఆన్లైన్లో ఎవరైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో అనుమతులు వస్తాయని తెలిపారు. ఒకవేళ రాకుంటే అనుమతులు వచ్చినట్టుగానే భావించి పరిశ్రమను ప్రారంభించుకోవచ్చని వివరించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని అన్నారు. టీఎస్ ఐపాస్‌తో తమ హయాంలో 28 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఫలితంగా రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని వెల్లడించారు. తద్వారా 24 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో సులభతర వాణిజ్యంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఎదిగిందని కేటీఆర్ వివరించారు. తన ప్రసంగంతో తెలంగాణ విజయయాత్రను సాధికారికంగా వివరించిన కేటీఆర్, బ్రిడ్జ్ ఇండియా సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. సదస్సుకు హాజరైన వివిధ దేశాల రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కేటీఆర్ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. ఆయన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని త్రీగోర్జెస్ డ్యామ్‌కు సరిసమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరం అని కేటీఆర్ అభివర్ణించారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో 80 మీటర్ల సముద్ర మట్టపు ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకునిపోయి ప్రతిసీజన్‌కు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం చాలా కష్టం అన్న కేటీఆర్, అందుకు కావలసిన అన్ని రకాల అనుమతులను తీసుకొని, ప్రాజెక్టుతో నష్టపోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం 3 సంవత్సరాల కాలంలోనే పూర్తిచేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామని పేర్కొన్నారు. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న ఇండియాలో ప్రతీ ఇంటికి శుద్ధిచేసిన తాగునీటిని అందించడం స్వప్నంగానే ఉన్న సమయంలో, కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కోటి ఇండ్లకు మిషన్ భగీరథతో సురక్షిత మంచినీటిని అందించిందని ఉద్ఘాటించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఉపరితల నీటి వనరులతో ప్రతిఇంటికీ శుద్ధిచేసిన తాగునీటిని ఇప్పటికీ అందించడం లేదని వివరించారు.