హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో విద్యాసంసరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై గతంలో నియమించిన రాధాకృష్ణన్ కమిటీ నివేదిక ఏమైందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వెల్లడించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఘోరమైన వైఫల్యాల వల్లే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక ప్రాజెక్టులు చేజారిపోతున్నాయని విరుచుకుపడ్డారు. సోమవారం ఢిల్లీలో అక్కడి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. దేశంలో విద్యాసంసరణలు, రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులు, ఐటీ, సెమీకండక్టర్ల పెట్టుబడులు తదితర పలు కీలక అంశాలపై మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు.
రైల్వే ప్రాజెక్టులు నిలిచిపోయాయి
కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ కృషితో మంజూరైన కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేగంగా జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిచిపోయాయని కేటీఆర్ విమర్శించారు. ఈ రైల్వేమార్గాన్ని విద్యుదీకరణ సహా మిడ్‌మానేరు వద్ద రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఐటీ టవర్లు నిర్మించి ఐటీని విస్తరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దీంతో అనేక కంపెనీలు జిల్లాల నుంచి వెళ్లిపోతున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిందని పేరొన్నారు. ఉద్యోగాలు తగ్గుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం యువతకు ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును పూర్తిచేస్తే ద్వితీయ శ్రేణి నగరాల నుంచే ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీ ఉద్యోగాలు చేసే అవకాశముంటుందని, ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. పరకాల వంటి చిన్న పట్టణంలోనే ఒక యువ పారిశ్రామికవేత్త 250 ఉద్యోగాలు కల్పించినప్పుడు, జిల్లాకేంద్రాల్లో ప్రభుత్వం ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ప్రశ్నించారు.
సైరూట్ విజయం.. తెలంగాణకు గర్వకారణం
సైరూట్ రాకెట్ విజయానంతరం సంస్థ వ్యవస్థాపకులు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పడం తన ఆనందం కలిగించిందని కేటీఆర్ చెప్పారు. ఎలాన్ మస్ ఎన్నో సంవత్సరాల ప్రయత్నంలో సాధించలేని సక్సెస్‌ను సైరూట్ తొలి ప్రయత్నంలోనే సాధించిందని, ఇందులో తెలంగాణ యువత కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
పెట్టుబడులను కేంద్రం అడ్డుకుంటున్నది
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెమీకండక్టర్ అనుబంధ పరిశ్రమలకు పునాది పడిందని, కానీ రాజకీయ కారణాలతో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లించిందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు దావోస్‌లో సిద్ధమైన అమెరికా చిప్ డిజైన్ కంపెనీపై కేంద్ర మంత్రులు ఒత్తిడి తెచ్చి పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఇవ్వబోమని హెచ్చరించడంతో ఆ పెట్టుబడి తెలంగాణకు రాకుం డా పోయిందని మండిపడ్డారు. మైక్రాన్, శాంసంగ్, కేన్స్ వంటి కీలక సంస్థలను గుజరాత్‌కు తరలించారని, ఫ్యాబ్, సెమీకండక్టర్ రంగాల్లో రాష్ట్ర వచ్చే ప్రతి పెట్టుబడినీ కేంద్రం అడ్డుకున్నదని ఆరోపించారు.
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసేందుకు తగిన నీటిమట్టం ఉన్నా, ప్రభుత్వం కావాలనే ఎత్తిపోయడం లేదని మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత పరిమిత స్థాయిలో నీటిని నిల్వ ఉంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నదని రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రభుత్వ ఇంజినీర్లు స్పష్టంచేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్ చేయాల్సి వచ్చిందని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని, 16 టీఎంసీల నీటి కోసం వందల కిలోమీటర్ల దూరం తరలించే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. అందుకే 142 టీఎంసీల సామర్థ్యం, తగిన నిల్వ సామర్థ్యం ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించామని చెప్పారు.
బీజేపీ-కాంగ్రెస్ కుమ్మకు
ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, అర్ధరాత్రి కాంగ్రెస్, బీజేపీ నేతలతో రహస్యంగా సమావేశమవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
సెమీకండక్టర్ అనుబంధ పరిశ్రమలకు బీఆర్ఎస్ హయాంలోనే పునాది పడింది. కానీ రాజకీయ కారణాలతో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. పెట్టుబడి పెట్టేందుకు దావోస్‌లో అమెరికా చిప్ డిజైన్ కంపెనీ ముందుకొస్తే.. పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఇవ్వబోమని కేంద్ర మంత్రులు హెచ్చరించడంతో మనకు రాకుండా పోయింది. మైక్రాన్, శాంసంగ్, కేన్స్ వంటి కీలక సంస్థలను గుజరాత్‌కు తరలించారు. ఫ్యాబ్, సెమీకండక్టర్ రంగాల్లో ప్రతి పెట్టుబడినీ కేంద్రం అడ్డుకున్నది. – కేటీఆర్