KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తేతెలంగాణ) : కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా తరలించుకుపోతుంటే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు చోద్యం చూస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. మూడు నెలలుగా సాగర్ కుడికాలువ ద్వారా 646 టీఎంసీలను ఏపీ అక్రమంగా మళ్లిస్తుంటే రేవంత్ ప్రభుత్వంలో చలనంలేకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో కృష్ణ, గోదావరి నదీజలాలను మళ్లించి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేశామని ఆదివారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ఏడాది పాలనలో పంటపొలాలను ఎండబెట్టిందని విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణను హస్తం పార్టీ నిండా ముంచుతున్నదని దుయ్యబట్టారు. వచ్చే వేసవిలో ఎదురయ్యే తాగు, సాగునీటి సమస్యలపై దృష్టిపెట్టకుండా ముఖ్యమంత్రి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సాగర్, శ్రీశైలం నుంచి ఏపీ నీటి చౌర్యానికి పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని, ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటి పంట పొలాలు ఎండుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరులో నిర్వహించే ‘టెక్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025’కు ముఖ్యఅతిథిగా హాజరై కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం అందింది. ఈనెల 27, 28న ‘ఎంట్రప్రెన్యూర్ ఇండియా’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నది. సదస్సు తొలి రోజు డ్రైవింగ్ డిజిటల్ ఇండియాలో భాగంగా ‘ఇన్నొవేషన్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఏ టెక్నలాజికల్లీ అడ్వాన్స్డ్ ఫ్యూచర్’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సమ్మిట్లో ‘కృత్రిమ మేధస్సు వ్యాపారం.. సాంకేతికతపై చూపించే ప్రభావం’పై ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు చర్చించనున్నారు. సదస్సులో ‘గాలా ఐడియా అవార్డ్స్’ కార్యక్రమం చేపట్టనున్నారు.