మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్త’ అన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కల్యాణలక్ష్మి సక్కగ ఇయ్యని ఈ సిపాయి కోట్ల రూపాయల ఎట్ల తెస్తడని ప్రశ్నించారు. కూట్లె రాయి తియ్యలేనోడు ఏట్లె రాయి తీస్తడట అని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ‘వీళ్లు కాంగ్రెసోళ్లు, బంగారం ఇచ్చే మనుషులు కాదు, పుస్తెల తాళ్లు ఎత్తుకపోయే మనుషులు’ అని మేం ప్రజలకు ఆనాగే చెప్పినం. కానీ నమ్మలే. వాళ్లను నమ్మిండ్రు. ఇయ్యాల ఏమైంది..? పాలమూరు బిడ్డను, పాలమూరు బిడ్డను అన్నడు. ఏమైంది మరె పాలమూరు బిడ్డకు..? బంగారం దొరుకుతలేదా..? బంగారం దుకాణంల ఆయన మాటకు విలువలేదా..? ఎందుకిస్తలేవ్ తులం బంగారం..? ఎప్పుడిస్తవ్..? కళ్యాణలక్ష్మి గూడ సక్కగ ఇయ్యలేని ఈ సిపాయి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తడట. కూట్లె రాయి తియ్యలేనోడు ఏట్లె రాయి తీస్తడట. కోటి మంది ఆడబిడ్డలను
కోటీశ్వరులను చేయాలంటే ఎన్ని కోట్లు కావాలె..? కోటీ కోట్లు కావాలె. అబద్ధం చెబితే అతికేటట్టు ఉండాల్నా లేదా..? ఏనించి తెస్తడు కోటి కోట్లు..?’ అని సీఎం రేవంత్‌ను నిలదీశారు.
‘రేవంత్‌రెడ్డివి ఎన్ని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు..? గుర్తు తెచ్చుకోండి. చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్త అన్నడు. ఇచ్చిండా..? స్కూటీ ఇయ్యలే.. కానీ లూటీలు మాత్రం జోర్దార్గ నడుస్తున్నయ్. విద్యా భరోసా కార్డులు ఇస్త అన్నడు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు. రూ.12,500 కోట్లు రాక అటు కాలేజీలోల్లు, ఇటు విద్యార్థులు ఏడుస్తున్నరు. మీరే ఆలోచించండి. ఈ రెండేళ్లలో ఎవరికి లాభం జరిగింది..? ఏ వర్గానికి లాభం జరిగింది..? మీరే ఆలోచన చేయండి’ అని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.