ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగట్టిన కేటీఆర్తెలంగాణ రాకముందు సాంస్కృతిక పునరుజ్జీవం కోసం కొట్లాడిన కేసీఆర్.. వచ్చిన తర్వాత మన భాష, యాస, సంస్కృతికి ప్రాధాన్యం దక్కేందుకు ప్రయత్నించిండ్రు. 550 మంది కళాకారులతో సాంస్కృతిక సారథిని తెచ్చిండ్రు. వారిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి వేతనాలు ఇచ్చిండ్రు. -కేటీఆర్
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళాలు వేశారని? అంబేద్కర్‌ను ఎందుకు బందీగా ఉంచుతున్నారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఆ విగ్రహాన్ని టూరిజం సర్క్యూట్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ‘ఏప్రిల్ 14న వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి అంబేద్కరిస్టులు వస్తున్నరు. అప్పుడైనా తెరుస్తారా? ఆ తాళాలు తీస్తరా? ఎందుకు అంబేద్కర్‌ను సంకెళ్లలో పెడుతున్నారో మంత్రి జూపల్లి కృష్ణారావు సూటిగా సమాధానం చెప్పాలి’ అంటూ ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలో పర్యాటక రంగంపై జరిగిన చర్చలో మంత్రి జూపల్లి వ్యాఖ్యలకు కేటీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ భాషకు, యాసకు ప్రాణప్రతిష్ట చేసింది కేసీఆర్ అని, 550 మంది కళాకారులతో సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ప్రభుత్వం నుంచి వేతనాలు అందించారని గుర్తుచేశారు.
వారసత్వ సంపదను కాపాడినం
వారసత్వ సంపదను బీఆర్ఎస్ హయాంలోనే పరిరక్షించామని కేటీఆర్ వివరించారు. ‘రామప్ప ఆలయానికి మన రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా యునెస్కో గుర్తింపును తెచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే.. అందుకు కేసీఆర్ విశేష కృషి చేసిండ్రు’ అని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో కులీ కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారంతో తమ ప్రభుత్వం పునర్నిర్మించిందని చెప్పారు. ‘యాదాద్రి టెంపుల్‌ను అంత అందంగా, అద్భుతంగా కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. టెంపుల్ టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లాలి.. కానీ మేము ఏమీ చేయలేదని ఎలా అంటున్నారు?’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు సంబంధించి మొజంజాహీ మార్కెట్‌ను అద్భుంతంగా తీర్చిదిద్దామని, మురిగిచౌక్, మీర్ అలం ట్యాంక్ వంటి ఓల్డ్‌సిటీలో ఎన్నో వారసత్వ సంపదలను రిస్టోర్ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే రిలీజియస్, స్పిరిచువల్, ఈకో, మెడికల్, అడ్వెంచర్ టూరిజాలను అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ‘రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ దగ్గర టూరిజం అభివృద్ధి అవుతున్నదంటే కారణం.. వాటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించడం వల్లనే కదా? వాటి టూరిజానికి డబ్బులు కేటాయించింది బీఆర్ఎస్ కాదా? అనేది మంత్రి చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
పప్పు ఉడికినంక ఉప్పేసుడు కాదు
సాంస్కృతిక టూరిజంలో భాగంగా రాష్ట్రపతితో సహా దేశంలోని వివిధ ప్రముఖులను ఆహ్వానించి ప్రపంచ తెలుగు మహాసభలను బీఆర్ఎస్ హయాంలోనే ఘనంగా నిర్వహించామని కేటీఆర్ గుర్తుచేశారు. 2017లో గ్లోబల్ అంత్రప్రెన్యూర్ సమ్మిట్‌కు ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్‌ను తీసుకొచ్చి వైభవంగా నిర్వహించామని చెప్పారు. నాగార్జునసాగర్‌లో బుద్ధవనాన్ని నాటి నేతలు జానారెడ్డి ప్రారంభిస్తే.. దాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేశామని గుర్తుచేశారు. అక్కడ 200 ఎకరాలను స్పిరిచువల్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టామని చెప్పారు. ఇక కొల్లాపూర్‌లో కూడా సోమశిలను బ్రాహ్మాండంగా అభివృద్ధి చేశామని, రిసార్ట్లు, కాటేజ్‌లు కట్టి పూర్తి చేశామని తెలిపారు. ‘వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని 95 శాతం మేము పూర్తి చేసినం.. పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసినట్టు మీరు చేసిండ్రు’ అంటూ కేటీఆర్ చురకలంటించారు.
అమరుల స్తూపాన్ని పట్టించుకోండి
అమరవీరుల స్తూపాన్ని పట్టించుకోవాలని, అక్కడ కూడా టూరిజం అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ సూచించారు. తెలంగాణ కవులు, కళాకారులు గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్‌ను చట్టసభల్లోకి తెచ్చింది బీఆర్ఎస్, కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ‘33 ఏండ్లకు ఓర్ఆర్ఆర్ను టీవోటీ పద్ధతిలో ఇస్తే.. ఘోరం, స్కాం అన్నరు. మీ టూరిజం పాలసీలో ప్రభుత్వ భూములను 99 ఏండ్లు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇస్తామని చెప్పిండ్రు. 33 ఏండ్లకు లీజుకిస్తే అదిపెద్ద స్కాం అయితది.. మరి 99 ఏండ్లకు అంటే జీవితకాలం ఇస్తే ఇదెట్ల న్యాయమైతది?’ అంటూ నిప్పులు చెరిగారు.
హెచ్‌సీయూ విద్యార్థులకు కేటీఆర్ సంఘీభావం
హెచ్సీఎయూ భూములను కాపాడేందుకు ఉద్యమిస్తున్న విద్యార్థులకు కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి తెలంగాణ భవన్లో వర్సిటీ విద్యార్థులు కేటీఆర్‌ను కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను వేలం వేసేందుకు కుట్ర చేస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సమస్యను కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని వివిధ సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇందుకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. పోరాటానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఫార్ములా-ఈ తప్పయితే.. అందాల పోటీలు తప్పేa‘ఓవైపు రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. పంటలు ఎండిపోయి ఏడుస్తున్నరు. తాగునీరు, సాగునీరు కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అదీ మే నెలలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ఎందుకు?’ అని కేటీఆర్ నిలదీశారు.
‘మిస్‌వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలకు క్రేజ్ పోయింది. అదేదో గొప్పయినట్టు.. ఆ ఈవెంట్‌ను మేమేదో అడ్డుకుంటున్నట్టు చెప్తున్నరు. ఈ మిస్‌వరల్డ్ పోటీల వల్ల ఆదాయం, కొలువులు వస్తయంటున్నరు. అవి ఎట్ల వస్తాయో చెప్పాలె’ అంటూ మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. ‘మిస్వరల్డ్కు రూ.56 కోట్లు తప్పా? అని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. మరి ఫార్ములా ఈ రేస్‌లో రూ.46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా రద్దు చేశారు. అంతపెద్ద అంతర్జాతీయ ఈవెంట్‌ను రద్దు చేసినవాళ్లు.. ఇక్కడేమో ప్రభుత్వ డబ్బును ఖర్చు చేయడం న్యాయమెట్లా అవుతది?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘ఇండియాలో యూనిట్ పెట్టాలనుకుంటున్న టెస్లా అనే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ.. ఫార్ములా-ఈ రద్దుతో వెనక్కి వెళ్లింది. మొదటి రేస్‌తో రూ.700 కోట్లు వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా.. 56 కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది మీ డబుల్ స్టాండర్డ్ కాదా? ఇది మీ హిపోక్రసీ కాదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫార్ములా-ఈ వల్ల మేం ఆశించింది తెలంగాణ మొబిలిటీ వ్యాలీ. దివిటిపల్లిలో అమర్‌రాజా బ్యాటరీలు తెచ్చినం.. 1200 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ పెట్టినం.. జహీరాబాద్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నం. ఇన్ని చేసిన మా ప్రభుత్వాన్ని బద్నాం చేసిండ్రు. కానీ, అందాల పోటీలతో ఆదాయం వస్తది.. ఉద్యోగాలు వస్తయని చెప్తున్నరు. ఇదెట్లా సాధ్యమైతది? ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రకటనలు?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.