హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అమెరికాలో దుండగుల దాడిలో మృతిచెందిన గంగ ప్రవీణ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు. షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలానికి చెందిన గంప రాఘవులు కుమారుడు గంప ప్రవీణ్‌ను దుండగులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా స్థానిక నేత రవీందర్ యాదవ్ ఫోన్ ద్వారా కేటీఆర్ రాఘవులుతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జరిగిన దారుణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ధైర్యంగా ఉండాలని.. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత రాయబార కార్యాలయంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.