KTR | అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ బిడ్డ దీప్తి జివాంజి, ఏపీకి చెందిన జ్యోతి యర్రాజీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేసి.. వంద కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు చెప్పారు. పారా అథ్లెట్ దీప్తి, అథ్లెట్ జ్యోతి యర్రాజీ అవార్డులకు ఎంపికై తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని దేశం దశదిశలా వ్యాపింపజేశారన్నారు. భవిష్యత్‌లో ఇలాగే మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ క్రీడా పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 32 మందికి అర్జున పురస్కారాలకు ఎంపికయ్యారు. మను బాకర్, గుకేశ్, ప్రవీణ్ కుమార్, హర్మన్ ప్రీత్ సింగ్‌లు ఖేల్‌రత్న అవార్డులకు ఎంపిక చేసింది. పలువురు క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజీ జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జీవాంజి దీప్తిలకు అర్జున అవార్డులు వరించాయి. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు అవార్డులను అందజేయనున్నారు.