హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన డ్రూ వెస్మన్, కటాలిన్ కరికో నోబెల్ పురస్కారానికి ఎంపికవడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఎక్స్‌లో తెలిపారు. ఈ సందర్భంగా బయో ఏషియా -2022 సదస్సులో అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డ్రూ వెస్మన్తో వర్చువల్‌గా జరిగిన చర్చను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
మెడికల్ సైన్స్‌లో చేస్తున్న పరిశోధనలను డ్రూ తనతో పంచుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని రకాల కరోనా వేరియెంట్లను ఎదుర్కొనేందుకు ఒకటే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే అతని ప్రతిభను గుర్తించానని, ఆ విషయాన్ని స్వయంగా తెలియజేశానన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా తెలంగాణ ఎదిగిన విషయాన్ని డ్రూకు వివరించానని తెలిపారు. వరల్డ్ వ్యాక్సిన్ సెంటర్‌గా భవిష్యత్తులోనూ మరింత సేవలు అందిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశానని పేర్కొన్నారు. డ్రూ, కటాలిన్ భవిష్యత్తులోనూ వైద్య రంగంలో సేవలు అందించాలని ఆకాంక్షించారు.