హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ) : జేఈఈ తెలంగాణ టాపర్ వివన్ మహేశ్వరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ‘వెల్డన్ వివన్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని నివాసంలో వివన్, ఆయన తల్లిదండ్రులు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థికి పుష్పగుచ్ఛమిచ్చి శాలువా కప్పి సత్కరించారు. వివన్ జేఈఈ మెయిన్స్‌లో 100 పర్సంటైల్ సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా 61వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
కేటీఆర్ అభినందనపై వివన్ సంతోషం వ్యక్తంచేశాడు. విజయం అంటే కేవలం ఫలితాలు మాత్రమే కాదని, క్రమశిక్షణ, నిలకడ, పరిమితులకు మించి ఆలోచించడం అని కేటీఆర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు ఉన్నారు.