హైదరాబాద్/ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ హయాంలో బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. అయితే, రేవంత్‌రెడ్డి సర్కారు వాటి నిర్వహణను గాలికొదిలేసింది. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు చేపట్టిన ’బస్తీ దవాఖాన బాట’లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖైరతాబాద్‌లోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానను, మాజీ మంత్రి హరీశ్‌రావు శేరిలింగంపల్లిలోని ఓల్డ్లింగంపల్లి బస్తీ దవాఖానను సందర్శించగా, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నగరంలోని పలు బస్తీ దవాఖానలను సందర్శించారు.
యూసుఫ్‌గూడ బస్తీ దవాఖానాను బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్‌తో కలిసి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుబాటులో ఉన్న మందుల్లో కొన్నింటి గడువు ముగిసినట్టు గుర్తించారు. వైద్యులు, నర్సులు వాడే కత్తెరలు తుప్పుపడి ఉండటం విస్మయానికి గురిచేసింది. దీంతోపాటు శాంపిల్ కలెక్షన్ తీసుకునేచోట మొత్తం దుమ్ముతో పేరుకుపోయి ఉన్నది. బస్తీ దవాఖానకు నీటి సరఫరా లేకపోవడంతో బకెట్‌తో బయటినుంచి నీళ్లు మోసుకొస్తుండటం కనిపించింది. బీఆర్ఎస్ హయాంలో సరఫరా చేసిన కేస్షీట్ల (గులాబీరంగు)నే ఇప్పటికీ అధికారులు వాడుతున్నట్టు బయటపడింది. దీంతోపాటు లెటర్హెడ్లు, ఎన్వలప్‌లు సైతం నాడు పంపిణీ చేసినవే ఉన్నట్టు తేలింది. తమకు ఆరు నెలల నుంచి జీతాలు రావడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని అక్కడి సిబ్బంది వాపోయారు.
రసుల్పురలోని బస్తీ దవాఖానా పర్యటన సందర్భంగా గడువు ముగిసిన మందులను ఓ పేషెంట్‌కు సరఫరా చేసినట్టు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ గుర్తించారు. జూలైలోనే గడువు ముగిసిన మందులను ఇప్పుడు సరఫరా చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గడువు ముగిసిన మందులను సదరు పేషెంట్ వేసుకుని ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దవాఖానలో మందుల స్టాక్ లేదని, సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. తమకు ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని అక్కడి సిబ్బంది క్రిశాంక్ దృష్టికి తీసుకొచ్చారు.
రసూల్‌పురా బస్తీ దవాఖానాలో కాలంచెల్లిన మందులు పంపిణీ చేయడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని పిటిషన్ వేశారు. బస్తీ దవాఖానల్లో కాలంచెల్లిన మందుల సరఫరాను వెంటనే నిలిపివేయాలని, తక్షణమే ప్రజల సంరక్షణకు సరైన మందులు అందుబాటులో ఉంచేవిధంగా డీహెచ్‌ను ఆదేశించాలని కోరారు. కాలంచెల్లిన మందులను పంపిణీచేసిన వైద్యాధికారులపై, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రైవేటుకు దీటుగా బీఆర్ఎస్ హయాంలో బస్తీ దవాఖానాలను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయగా అందులో హైదరాబాద్‌లోనే 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. ఇంటి వద్దకే ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్‌నర్సు వెళ్లి వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. 57 రకాల ఉచిత పరీక్షలు, 108 రకాల మందులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం బస్తీ దవాఖానల్లో 40 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం.
మందులు, సిరప్లు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిరోజూ సగటున 100 మంది బస్తీ దవాఖానల్లో వైద్యం చేయించుకునేవారు. బస్తీ దవాఖానాల రాకతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోరంటి సహా జిల్లా దవాఖానాల్లో పేషెంట్ల సంఖ్య తగ్గి పెద్ద దవాఖానలపై భారం గణనీయంగా తగ్గింది. బస్తీ దవాఖానాల రాకతో అనేకమందికి ఉపాధి సైతం లభించింది. బీఆర్ఎస్ హయాంలో బస్తీ దవాఖానాలను 15వ ఆర్థికసంఘం కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. రేవంత్‌రెడ్డి సర్కారు అధికారంలోకి రాగానే కేసీఆర్‌కు పేరు వచ్చే పథకాలను ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టారనే ఆరోపణలున్నాయి.
ఒకవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలొస్తున్నాయి. పేదలకు రోగ నిర్ధారణ పరీక్షలు భారం కావద్దనే ఉద్దేశంతో 33 జిల్లాల్లో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ను సైతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విస్మరించిందనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో 134 పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన వైద్య పరికరాలు, రీఏజెంట్స్ సైతం సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. మెషిన్లు పాడైతే సకాలంలో మరమ్మతు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌పై సమీక్ష నిర్వహించాలని, ఆరు నెలలుగా పెండింగ్ ఉన్న బస్తీ దవాఖానాల వైద్య సిబ్బంది వేతనాలను చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.