చండూరు, డిసెంబర్ 05 : రూ.15 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా చండూర్ మండల డిప్యూటీ తాసీల్దార్ చంద్రశేఖర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి దివంగత తండ్రికి చెందిన భూమికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యుటేషన్ ప్రొసీడింగ్స్, సంబంధిత పత్రాలను ఫిర్యాదుదారునికి అందజేయడానికి డిప్యూటీ తాసీల్దార్ లంచం డిమాండ్ చేశాడు. హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు అతడిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.