KTR | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డీ..జూబ్లీహిల్స్‌లోని నీ ప్యాలెస్‌లో అయినా సరే.. ఈడీ ఆఫీస్‌లో అయినా సరే.. న్యాయమూర్తి ఇంట్లోనైనా సరే.. ఎక్కడైనా నేను లైడిటెక్టర్ పరీక్షకు రెడీ. ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో? దొరెవరో? తేలిపోతుంది. ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. డేట్, టైమ్, ప్లేస్ నువ్వే చెప్పు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా సవాల్ విసిరారు. ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించి గురువారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.35 గంటల తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. సుమారు 8 గంటల విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను ఈడీ విచారణకు వచ్చానని, రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తన మీద అక్రమ కేసు పెట్టిందని చెప్పారు. విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న 9వ తేదీన ఏసీబీ విచారణకు హాజరయ్యానని, ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి 16న ఈడీ విచారణకు రమ్మని పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యానని తెలిపారు. ఆ రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను ఏడు నుంచి 8 గంటలపాటు అడిగిందే అడిగి వివరాలు తీసుకున్నాయని చెప్పారు.
ఇంతమంది నాయకులు, విచారణ సంస్థలతో మొత్తం రూ.5-10 కోట్ల ఖర్చవుతుందని మీడియాలో చదివానని కేటీఆర్ తెలిపారు. ‘ఈ విచారణ వల్ల రూ.5-10 కోట్ల ప్రజాధనం వృథా అవుతుంది. అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలు వృథా చేయడం ఎందుకు? ఆ పైసలతోని 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. దాదాపు 2,500 మంది వృద్ధులకు పింఛన్లు ఇవ్వొచ్చు. ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు’ అని హితవు పలికారు. ‘రేవంత్‌రెడ్డిగారూ.. మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి.. నా మీద ఏసీబీ కేసు పెట్టిండ్రు. మీ మీద ఈడీ కేసు అయ్యింది కాబట్టి.. నామీద ఈడీ కేసు పెట్టిండ్రు. నువ్వంటే అడ్డంగా దొరికినోడివి. నేనంటే ఏ తప్పూ చేయనోడిని కాబట్టి.. ధైర్యంగా కేసులు ఎదుర్కొంటా’ అని పేర్కొన్నారు. ‘సంక్రాంతి పండగ సందర్భంగా రేవంత్‌రెడ్డికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నా. న్యాయమూర్తి ఎవరైనా సరే.. మీడియా సాక్షి గా లై డిటెక్టర్ పరీక్షకు పోదాం. న్యాయమూర్తుల సమక్షంలో మనిద్దరం మీడియా ముం దు చర్చ పెడదాం.. మీడియా వాళ్లు ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అడగమను. ఫార్ములా ఈ-కార్ రేసు, ఓటుకు నోటు కేసులకు సం బంధించి రేవంత్‌ను, నన్ను ప్రశ్నలు అడగం డి. అక్కడే ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష పెట్టమం దాం. నేను సమాధానం చెప్తా. ఆయన కూడా జవాబు చెప్పాలి. ప్రజలు మొత్తం చూస్తారు.. రూ.50 లక్షలో రూ.20 లక్షలతోనో మొత్తం ఒడిసిపోతుంది. ఎందుకు ఇంత ప్రజాధనం వృథా చేయడం’ అని సూచించారు.
‘ఇదే కేసు మీద ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అంతిమంగా గెలుస్తుంది. స్థానిక కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయి. భారత న్యాయవ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉన్నది. ఇవాళ కాకున్నా ఇంకో 4 రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకున్నది’ అని కేటీఆర్ మీడియా సాక్షిగా చెప్పారు. తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలు, మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, మీడియా మిత్రులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘నేను తప్పు చేసినట్టు తేలితే నేను ఏ శిక్షకైనా రెడీ’ అంటూ మరోసారి తన కేటీఆర్ స్పష్టంచేశారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. తప్పు చేయబోను. 8 గంటలు వాళ్లు ఇదే అడిగారు. నేను ఇదే చెప్పాను. ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40కి పైగా ప్రశ్నలు అడిగింది. అన్నింటికీ సమాధానాలు ఇచ్చాను’ అని తెలిపారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌కు మద్దతుగా చేరుకొని సంఘీభావం తెలిపారు. వారిలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, సుంకె రవిశంకర్, బాల్కసుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు సాగర్, చిరుమళ్ల రాకేశ్, గజ్జల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు కిశోర్‌గౌడ్, రాగిడి లక్ష్మారెడ్డి, రంగినేని అభిలాష్, కురవ విజయ్, తుంగబాలు, దాస రి ఉష, రాకేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈడీ విచారణలో పలు అంశాలకు కేటీఆర్ వివరంగా సమాధానమిచ్చారు. గురువారం ఈడీ విచారణకు ఫార్ములా-ఈ పైన, నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదిక, తెలంగాణ ఈవీ పాలసీ -2020కి సంబంధించిన రెండు డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు ఇచ్చిన కేటీఆర్.. వారి నుంచి రిసిప్ట్ తీసుకున్నారు. ఫార్ములా ఈ-రేసు అనంతరం స్వతంత్ర సంస్థ నీల్సన్ రూపొందించిన నివేదికను కేటీఆర్ వారికి అందజేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 82 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక లబ్ధి జరిగిందని ఆ సంస్థ తెలియజేసిన రిపోర్టును ఈడీ అధికారుల ముందుంచినట్టు తెలిసింది. దీంతోపాటు అప్పటి ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో ప్రకటించిన తెలంగాణ ఎలక్ట్రిక్ పాలసీ కాపీని ఈడీ అధికారులకు కేటీఆర్ అందజేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో ‘తెలంగాణ మొబిలిటీ వ్యాలీ’ని ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఇంధన వనరులతోపాటు, మొబిలిటీ రంగంలో తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దే ఒక గ్రాండ్ విజన్, ఎజెండాతో పెట్టిన పాలసీనే ‘తెలంగాణ ఈ-వీ పాలసీ’ అని అధికారులకు కేటీఆర్ వివరించినట్టు తెలిసింది.
ఈవీ పాలసీ స్ఫూర్తిలో భాగంగానే తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ.. ఈవీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై దీర్ఘకాల ఎజెండాతో ఈ- రేసును నిర్వహించినట్టు కేటీఆర్ వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ-రేసుతో రాష్ట్రంతో పాటు దేశానికి కూడా లాభం జరిగిందని, దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రు లు హర్దీప్సింగ్ పురి, నితిన్ గడరీ, అనురాగ్ ఠాకూర్, కిషన్‌రెడ్డి వంటి కేంద్ర మం త్రులు కూడా ఈ-రేసు కార్యక్రమంలో పాల్గొన్నట్టు కేటీఆర్ వివరించారు. కేవలం సాంకేతిక అంశాలు మినహా ఎకడా పైసా అవినీతి గాని, మళ్లింపు గాని జరగలేదని వివరించారు. ప్రభుత్వ నిధులు, ఇకడి నుంచి ఫార్ములా-ఈ సంస్థకు చేరిన రికార్డుల్లోని లావాదేవీలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. ఇకడి నుంచి వెళ్లిన డబ్బు మొత్తం.. సంస్థ వద్ద ఉన్నప్పుడు ఇందులో అవినీతి ఎక్కడిదని ప్రస్తావించారు.