హైదరాబాద్ : ప్రజలకు పరిపాలన ఫలాలు అందకుండా జిల్లాల పునర్విభజన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల రద్దుపై ( Districts Abolish ) చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారు. పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.
పాలమూరు జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలకు ప్రభుత్వం యొక్క సేవలు, అభివృద్ధి అందాల్సిన అవసరాలను వివరించాలన్నారు. కేసీఆర్ పరిపాలన, వికేంద్రీకరణ అనే దృక్పథంతో పాలమూరును అనేక జిల్లాలుగా మార్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. పాలమూరు జిల్లా బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఆ ఉమ్మడి జిల్లాపై కుట్రతో జిల్లాలను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు అంశాలపై ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించే విధంగా చైతన్యపరిచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
మున్సిపాలిటీ వారీగా ప్రత్యేక కార్యాచరణ..

మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీ వారీగా ప్రత్యేక కార్యాచరణతో, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమష్టిగా ముందుకు పోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ అయిన మహబూబ్నగర్ పట్టణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వెల్లడించారు. దీంతోపాటు 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టాలని సూచించారు.
ఒకప్పుడు తీవ్రంగా వెనుకబడిన నల్లగొండ జిల్లాను బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామో ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్న నల్లగొండ జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విమర్శించారు. నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరును పట్టణ ప్రజలకు వివరించాలన్నారు.
గతంలో టీయూఎఫ్ఐడీసీ , పురపాలక శాఖ ద్వారా గతంలో అనేక వందల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించాలన్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని, అదే స్ఫూర్తిని మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి , పలువురు పాల్గొన్నారు.