హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి నీట్ పేపర్ లీకైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దుచేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. పగలూరాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని విమర్శించారు. 2024లోనూ నీట్ ప్రశ్నపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న మోదీ సర్కార్ అసమర్థత విద్యార్థులపట్ల శాపంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సరార్ తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని మండిపడ్డారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకొని వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటన వెనుక ఎవరున్నా వాళ్లందర్నీ పట్టుకొని కఠినంగా శిక్షించాలని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్‌ను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తిచేశారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి : పల్లె రవిగౌడ్
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని కేంద్ర ప్రభుత్వం 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ఈ లీకులు జరుగడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని మండిపడ్డారు. 2024, 2025 నీట్ ప్రశ్నపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే ఈ సంవత్సరం కూడా ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు.
సమగ్ర విచారణ జరిపించాలి: పడాల సతీశ్
విద్యార్థి లోకానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి, పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించి నిందితులైన అధికారులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ డిమాండ్ చేశారు. దేశంలో ఓటు చోరీతోపాటు మేధావుల చోరీ కూడా జరుగుతున్నదని, మోదీ సర్కార్‌లో పేపర్లు లీక్ చేస్తున్న వ్యవస్థ కూడా మిళితమై ఉన్నదని విమర్శించారు.