KTR | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) తమ నూతన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, విలువైన కారు బ్రాండ్ అయినా మైక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి ప్రముఖ ఆటో దిగ్గజాలకు ఈ సంస్థ సేవలు అందిస్తున్నది. 15 ఏండ్లకుపైగా ఈ సంస్థ ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక ఉత్పత్తులను, సేవలను అందిస్తూ వస్తున్నది. నూతన కేంద్రం ద్వారా ఆటోమోటివ్ డెవలప్మెంట్, టెస్టింగ్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్టు పీడీఎస్ఎల్ సంస్థ తెలిపింది.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ పరిశోధన కేంద్రాన్ని ఈ నెల 30న కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించాలని భావించి ఆహ్వానం పంపినట్టు పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ, ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దిన కేటీఆర్ నాయకత్వాన్ని గౌరవంగా గుర్తించిన పీడీఎస్ఎల్ తమ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నట్టు వెల్లడించింది.
‘ఇన్నోవేషన్, రీసెర్చ్ రంగాల పట్ల కేటీఆర్‌ది వినూత్నమైన, విప్లవాత్మకమైన దృక్పథం. అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాల స్థాపన, ఇన్నోవేషన్ ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషి మా సంస్థ విధానాలకు అనుగుణంగా ఉన్నది. ఆయన చేతులమీదుగా మా పరిశోధనా కేంద్రం ప్రారంభించుకోవడం గర్వంగా భావిస్తున్నాం’ అని సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పాల తెలిపారు. పీడీఎస్ఎల్ సంస్థ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తంచేసిన కేటీఆర్.. ప్రారంభోత్సవానికి హాజరవుతానని హామీ ఇచ్చారు.