KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కదిలింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్ 10 నాటికి ఏడాది అవుతుంది. ఆలోగా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రకటించింది. సమగ్ర కుల గణనను వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చిన విధంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుల గణన పెద్ద కష్టమేమీ కాదని, గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజులో చేశారని ఆయన గుర్తు చేశారు. వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ. 25-30వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో బీసీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, తెలంగాణ సర్పంచ్ల సంఘం, తెలంగాణ ఎంపీటీసీ జిల్లా సంఘం అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మూడు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే దానిపై చర్చించారు. సమావేశానికి హాజరైన నేతలు అభిప్రాయాలను కేటీఆర్ తెలుసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుడు నవంబర్ 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను కాంగ్రెస్ మోసం, దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతామని, నిలదీస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేసే దాకా వదిలిపెట్టేది లేదన్నారు.
వచ్చే బడ్జెట్లో 30వేల కోట్లు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీని నవంబర్ 10లోగా నెరవేర్చకుంటే పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. బీసీలకు ఐదేండ్లలోపు లక్ష కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి బీసీలను మోసం చేసిందని విమర్శించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా బీసీ సబ్‌ప్లాన్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎంబీసీల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారని, ఆ మాటకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. క్యాబినెట్లో బీసీ మంత్రులు ఇద్దరు మాత్రమే ఉన్నారని, వారికి మరిన్ని మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 22 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణీ ఆపేసి ముదిరాజ్‌లు, గంగపుత్రులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి రూ.30వేల కోట్ల సంపదను సృష్టించిందని గుర్తుచేశారు. బలహీనవర్గాల కోసం ఏర్పాటుచేసిన గురుకు ల విద్యాసంస్థల్లో ప్రమాణాలు దిగజార్చి వారి విద్యావకాశాలను దెబ్బకొడుతున్నదని విమర్శించారు.
కుంటి సాకులు చెబుతున్నారు
ఒకప్పుడు ఇదే గాంధీ, ఉస్మానియా దవాఖానలు కరోనా సమయంలో వేలాదిమంది ప్రాణాలను కాపాడాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే నెలలో 48 మంది పిల్లలు, 14 మంది బాలింతలు ఒక దవాఖానలోనే మరణించిన విషయం వాస్తవం కాదా? అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ సమస్యను సరి చేయాల్సింది పోయి కుంటి సాకులు చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ విజృంభిస్తున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత ఎస్ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, ఎల్ రమణ, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంబీపూర్,రాజు, మాజీ ఎమ్మెల్యేలు సురేందర్, అంజయ్యగౌడ్, నోముల భగత్, బిక్షమయ్యగౌడ్, కర్నె ప్రభాకర్, నరేందర్, పల్లె రవికుమార్, దాసోజు శ్రవణ్, గట్టు రాంచందర్‌రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాకేశ్‌కుమార్, అంజనేయులు, బాలరాజుయాదవ్, రాజారాంయాదవ్ పాల్గొన్నారు.
బీసీలకు అత్యధిక సీట్లు
గతంలో చట్టసభల్లో బీసీలకు అత్యధిక సీట్లను బీఆర్ఎస్ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. 2014, 2018, 2023 ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కన్నా ఎకువ సీట్లను బలహీన వర్గాలకు కేటాయించిందని పేర్కొన్నారు. గతంలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపామని, ఇటీవల బీఆర్ఎస్కు ఒక రాజ్యసభ స్థానం వస్తే దానిని కూడా బీసీలకు కేటాయించామని పేర్కొన్నారు. 50 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తే వారిలో 27 మంది బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్దదికుగా కేసీఆర్ ఉంటారని తెలిపారు. సమగ్ర కులగణనకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
వర్కింగ్ గ్రూపులుగా క్షేత్ర స్థాయిలోకి..
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతుందో తెలుసుకోవడానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో ఒక బృందం అక్కడ పర్యటిస్తుందని కేటీఆర్ తెలిపారు. బీసీల సమస్యలపై పార్టీలోని బలహీన వర్గాల నేతలను వరింగ్ గ్రూపులుగా విభజించి బీసీల సమస్యలు, వాటి పరిషారాలు, ప్రత్యక్ష పోరాటాల కోసం పనిచేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన సలహాలు సూచనలు ఇస్తామన్నారు.