అటు నేతగా.. ఇటు పాలకుడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో వివాదంతో రచ్చకెక్కుతున్నా వారిని కట్టడి చేయలేకపోవడమే రేవంత్ వైఫల్యాలకు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్13(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచింది. కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. పైగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి అనేక పథకాలను పక్కనబెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల సంగతి సరేసరి. దీంతో పాలకుడిగా సీఎం రేవంత్‌రెడ్డి పతనం అయ్యారు. నాయకుడిగా చూసినా విఫలముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలను, మంత్రులను సమన్వయం చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 16 మంది మంత్రులు ఉంటే.. వీరిలో ఏ ఇద్దరు మంత్రుల మధ్య కూడా కనీస సమన్వయం లేదు. రోజుకో కొత్త పంచాయితీతో రచ్చకెక్కుతున్నారు. ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్ మీటింగులు, రహస్య సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు.
పార్టీ మీద, ప్రభుత్వం తీరుపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కోట్లాటతో కొందరు మంత్రులు రోడ్లపై చెలరేగిపోతుంటే ముఖ్యమంత్రిగా వారికి ముకుతాడు వేయకలేక చతికిలపడ్డారని రేవంత్‌రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఒకరు తనను చంపుతాడేమోనని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బహిరంగ ఆందోళన వ్యక్తం చేయగా, ఈ ప్రభుత్వం కూలితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. మద్యం టెండర్ల వేళ ఇంకో ఎమ్మెల్యే ఏకంగా మద్యం దుకాణాలపై సొంత ఆక్షలనే ప్రచారంలోకి తెచ్చారు. వాటికి ఒప్పుకుంటేనే వ్యాపారులు టెండర్లు వేయాలని హెచ్చరికలు జారీచేశారు. ఎమ్మెల్యేలే ముందుపడి పోలీస్ అధికారులపై హౌస్మోషన్లు, కోర్టుల్లో పిటిషన్లు వేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్యేలను కట్టడి చేసి, పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటిపై నడపడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు వేలెత్తి చూపుతున్నారు. క్యాడర్ నుంచి లీడర్ దాకా విరామం లేకుండా పుట్టుకొస్తున్న వివాదాలు రేవంత్ నాయకత్వ సామర్థ్య లోపాన్ని బయట పెట్టాయని, కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే విఫల సీఎంగా మిగిలే దిశగా రేవంత్ అడుగులు పడుతున్నాయని వారు చెప్తున్నారు.
రాష్ట్ర జనాభలో 56.33 శాతం ఉన్న బీసీ ప్రజలు తమకు 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయో లేదోనని ఆందోళనతో ఉండగా, ఇదేమీ పట్టనట్టుగా మంత్రులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లి 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రంతో లాబీయింగ్ చేస్తారేమోనని అనుకుంటే కాం ట్రాక్టు గొడవలు, కులాల కుమ్ములాటలతోనే వారికి సరిపోతున్నదని పలువురు మండిపడుతున్నారు. 420 హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 20 నెలల పాలనలో ఒక్క సంక్షేమ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్పు కోరుకుంటే పదేండ్ల విధ్వంసం జరుగుతుందని ప్రజలు ఒకవైపు ఆందోళనలు వ్యక్తం చేస్తుంటే.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రం ఇదేమీ పట్టకుండా కాంట్రాక్టు పనులు, అవినీతి సొమ్ములో వాటాలు, అధికార మత్తు నుంచి పుట్టిన అసహనంతో కొట్లాటలకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొలిసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య అంతర్గత వివాదం మొదలైంది. వారిద్దరి మధ్య హెలికాప్టర్ చిచ్చు పెట్టింది. జూలై మాసం చివరి వారంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లాలని నిర్ణయించారు. ముగ్గురూ ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉండగా, మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి సమయానికి వచ్చారు. మంత్రి ఉత్తమ్ మాత్రం తీవ్ర ఆలస్యం చేశారు. 10 గంటల వరకు ఎదురుచూసినా రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి వెనకు వెళ్లిపోయారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దానిని పట్టించుకోకుండా తన వెంట వచ్చిన మంత్రి అడ్లూరిని వెంటబెట్టుకొని వెళ్లి కార్యక్రమం పూర్తిచేశారు. అక్కడి నంపచి మొదలైన మంత్రుల మధ్య సమన్వయలోపం ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ, హోసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విభేదాలు పొడచూపాయి. మేడారం జాతర అభివృద్ధి పనులకై రూ 70 కోట్ల విలువైన టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారని సురేఖ రోడ్డెక్కారు. తనకు కాకుండా, తనకు తెలియకుండా తన మంత్రిత్వ శాఖ పరిధిలోని పనులపై పొంగులేటి ఆదేశాలు జారీ చేయడంపై కొండా సురేఖ మండిపడుతున్నారు. ఆయన మనుషులకు టెండర్లు ఇచ్చుకోవడానికి పొంగులేటి ప్రయత్నిస్తున్నారని ఆమె టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు ధ్రువీకరించారు. ఆమె అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. సీఎం స్థాయిలో కూడా పరిషారం కాలేదని భావించిన సురేఖ ఇప్పుడు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సోమవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి, మరో మంత్రి సీతక్క, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మేడారం జాతర పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. వాస్తవానికి మేడారం జాతర సమీక్షించడం ఆ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యత. కానీ ఆమె లేకుండానే మేడారం జాతరపై సమీక్ష పూర్తిచేశారని, ఈ పరిణామం కేవలం మేడారం టెండర్ల చుట్టూ మాత్రమే కాదని, ప్రభుత్వం లోపల ఉన్న మంత్రుల శక్తి సమతుల్యతను సూచిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మంత్రుల మధ్య అధికార పరిమితుల స్పష్టత లేకపోవడం, ఆధిపత్య కులాలు, ఆర్థిక వెసులుబాటు ఉన్న మంత్రులు బలహీన వర్గాల మంత్రులపై ప్రభావం చూపించాలనే ప్రయత్నాలే ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయని వారు చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే క్యాబినెట్ మంత్రుల మధ సమతుల్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా మంత్రుల మధ్య ఉన్న గ్యాప్‌ను తుడిపేయడంలో విఫలం అయ్యారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మొదట్లో ముఖ్యమంత్రితోనే పలువురు మంత్రులు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. దీంతో తన స్థానం బలోపేతం చేసుకోవడం కోసం తానే మంత్రుల మధ్య అపార్థాలను పెంచి పోషించారని గాంధీభవన్, సచివాలల వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కు, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదాలు కుల విభేదాలకు రూపం దాల్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కులం ఆధారంగా తనపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని, కొందరు ఆయనలో విషం నింపి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని మంత్రి వివేక్ సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఇది కూడా అధికార పరిమితుల దురాక్రమణతోనే వచ్చిన సమస్య అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రులు ముస్లిం మైనార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడ్లూరి లక్ష్మణ్ వచ్చేవరకు వేచి ఉండి, ఆయన ప్రారంభించిన తర్వాత మిగతా మంత్రులు సమావేశాన్ని కొనసాగించడం ప్రొటోకాల్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ అడ్లూరి పరిధిలో ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, వివేక్ వేలు పెట్టడమే తప్పని, వారు ఢిల్లీ వెళ్లే ప్రయత్నంలో ముందుగానే సమావేశానికి వెళ్లి లక్ష్మణ్ రాలేదని ప్రచారం చేయడం, పొన్నం నోటికి పని చెప్పి బాడీషేమింగ్ వ్యాఖ్యలతో అవమానకంగా మాట్లాడుతుంటే , మరో మంత్రి ఆయనకు మద్దతుగా మాట కలపడంతో సమస్య ఉత్పన్నం అయిందని వారు చెప్తున్నారు. ఇది ఎపిసోడ్ల వారీగా సాగుతూ కుల రాజకీయంగా రూపాంతరం చెందిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య జరిగిన హెలికాప్టర్ పంచాయితీకి కొనసాగింపుగానే చూడాల్సి వస్తుందని వారు అంటున్నారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రుల మధ్య ఏర్పడిన విభేదాలు అధికార పార్టీని డిఫెన్స్‌లో పడేశాయి.
రాష్ట్రంలో కులాల వారీగా, వర్గాల వారీగా, గ్రూపుల వారీగా ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలిసారి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తొలిసారి 10 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక హోటల్లో రహస్యంగా సమావేశం అయ్యారు. ప్రభుత్వంలోని మంత్రుల అవినీతిపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. తర్వాత మంత్రుల భూ దందాకు సంబందించిన ఫైళ్లు ఏకంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి తీసుకొచ్చి ఇదే ఎమ్మెల్యే పార్టీలో కలకలం రేపారు. వారి స్ఫూర్తితోనే మంత్రివర్గ విస్తరణ సమయంలో ఎమ్మెల్యేలు మాల, మాదిగ, గిరిజన సామాజిక వర్గాల వారీగా విడిపోయారు. ఎవరికి వారుగా రహస్య మంతనాలు జరిపి, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది పార్టీ నియమావళికి విరుద్ధమని చెప్పినా ఎవరూ ఖాతరు చేయలేదు. ఇటీవల కాంగ్రెస్ మంత్రి ఈ ప్రభుత్వం కూలిపోతేనే భూ బాధితులకు పరిహారం వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని కీలక ప్రాంతంలోని భూ వివాదంలోకి చొరబడి పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగడం, తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి హౌస్‌మోషన్ ప్రవేశపెడతానన్న బెదిరింపులకు సీఎం లొంగిపోయి పోలీస్ అధికారి చేత క్షమాపణ చెప్పించిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది.