నవాబుపేట, సెప్టెంబర్ 26: ‘ఎన్నికల ముందు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నడు. గెలిచినంక మాఫీ చేయకుండా తిప్పలు పెడుతుండు. నిలదీద్దామని పట్నమొస్తే.. మమ్మల్ని దొంగల్లాగా ఎస్ఆర్నగర్ పోలీసుస్టేషన్ల నిర్బంధించిన్రు. కేటీఆర్ గారూ మీరున్నప్పుడు మంచిగుండె.. మీరే మాకు దారి చూపాలి’ అంటూ వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం నారేగూడె వాసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్లో గోడు వెళ్లబోసుకున్నరు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకులతో రుణమాఫీకాని రైతుల సమస్యలు వినేందుకు గురువారం నవాబుపేటమండలం నారేగూడ కు వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు మల్లారెడ్డి, నాగిరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించారు. కేటీఆర్ వారికి భరోసా ఇస్తూ ‘మీ తరఫున ప్రభుత్వంపై మేము గట్టిగ కొట్లాడ్తం. మీ వెంట కేసీఆర్‌సార్, సబితమ్మ ఉన్నారు’ అని ధైర్యం చెప్పారు. ‘ఈ గుంపు మేస్త్రి దేవుళ్ల మీద ఒట్టు పెడితే నమ్మినం.ఇంత మోసం చేస్తడనుకుకోలే’అంటూ ఒకరైతు కన్నీరు పెడితే సబితారెడ్డి ధైర్యం చెప్పి ఓదార్చారు.
బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల వేధింపులు
మర్పల్లి : రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రవీణ్, నవీన్‌లను ఓ కేసు విషయంలో మర్పల్లి పోలీసులు అరెస్టు చేసి వేధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం మాజీ మంత్రి సబితారెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.