KTR | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మరో బుల్డోజర్ రాజ్ కాకుండా చూడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆ దిశగా రేవంత్రెడ్డి సర్కార్కు సూచించాలని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు.
‘ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయలుగా మార్చడం అమానవీయం, అన్యాయం అని గతంలో మీరే అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా పేదల ఇళ్లను అదే విధంగా కూల్చేస్తూ వారిని నిరాశ్రయులు చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
మహబూబ్నగర్ పట్టణంలోని 75 మంది పేదల ఇండ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన ఘటనను ఎక్స్ ద్వారా మల్లికార్జున్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసిన 75 ఇండ్లలో 25 కుటుంబాలు దివ్యాంగులకు చెందినవేనని ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుంచి 40 ఏండ్ల క్రితం ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న పేదలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేస్తుండడం అమానవీయమని పేర్కొన్నారు. తెలంగాణ మరో బుల్డోజర్ రాజ్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని ఖర్గేను కోరారు.