హైదరాబాద్, ఫిబ్రవరి 28 : రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను తయారు చేయాలని ఆ శాఖ అధికారులను చేనేత, జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి స్పందన వస్తున్నదని, ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన ప్రణాళికలపైన సమగ్ర నివేదికను రూపొందించాలని స్పష్టం చేశారు. టెక్స్టైల్, అనుబంధ రంగాల్లో తీసుకురావాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన మౌలిక వసతులు, నూతన పాలసీలు, నేతన్నల కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించారు. సోమవారం టెక్స్టైల్ శాఖపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడున్నరేండ్లుగా నేతన్నల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి సత్ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పారు.
టెక్స్టైల్ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా అనేక వినూత్న కార్యక్రమాలను తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఈ రంగాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించినట్టు వివరించారు. ఈ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై సర్కారు ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పారు కాకతీయ మెగా టెక్స్టైల్ పారును ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, మానవ వనరులు, సర్కారు పాలసీలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీ యంగ్ వన్, దేశీయ టెక్స్టైల్ దిగ్గజం కిటెక్స్ వంటి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. టెక్స్టైల్ శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పాటు, బడ్జెట్లో పొందుపర్చాల్సిన పథకాలు, ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్.. టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో టెక్స్టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్.. మీది గోల్డెన్ హార్ట్
మంత్రి కేటీఆర్‌కు బెంగళూర్ వాసి ట్వీట్
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం కావాలన్న కేటీఆర్ కార్యాలయం నుంచి అవసరమైన సాయం అందిస్తుంటారు. దీనిపై బెంగళూరుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి ‘మీకు బంగారం లాంటి హృదయం ఉన్నది. ప్రజలు, పిల్లలపై ప్రేమ ఉన్నది. దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలి సోదరా. మీరు దేవుడిలా చిరకాలం జీవించాలి’ అని ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి.. ‘మనలో ఎవరూ శాశ్వతంగా ఇక్కడే ఉండరు. మనకు ఇతరులకు సాయం చేయగల సామర్థ్యం ఉన్నా సెల్ఫ్ లైఫ్ పరిమితమే. ఏదో నా శక్తి కొద్ది సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా అంతే. మీ మంచి మాటలకు ధన్యవాదాలు సోదరా’ అని రిైప్లె ఇచ్చారు.