రాష్ర్టాన్ని రాహుల్‌కు ఏటీఎంగా మార్చిన రేవంత్.. కాంగ్రెస్‌లో లూటీ పోటీ
కేసీఆర్ పాలనలో తెరిపినపడ్డ తెలంగాణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు లూటీలో పోటీపడుతూ తెర్లుచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలోని రాహుల్‌గాంధీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నారని, ఇద్దరూ కలిసి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు.
- యథేచ్ఛగా దోచుకుంటున్న కాంగ్రెస్ గద్దలు
- ముఖ్యమంత్రి తమ్ముడి కంపెనీకి భూపందేరం
- రేవంత్‌రెడ్డి పాలనలో హైదరాబాద్ బర్బాద్
- మోకా ఇచ్చిన ప్రజలకు ధోకా చేస్తున్న కాంగ్రెస్
- బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే జుమ్లా-హమ్లా
- రెండేండ్లలో కేసీఆర్ సీఎం కావడం పక్కా
- జిబ్రాన్ షరీఫ్ చేరిక కార్యక్రమంలో కేటీఆర్
ఫోర్త్‌సిటీలో రేవంత్ సోదరుడికి 200 కోట్ల విలువైన ఐదెకరాలు రూ.7 కోట్లకే కేటాయింపు.. అమెరికాలోని మరో తమ్ముడి కంపెనీతో రూ.1000 కోట్ల ఒప్పందం.. ఆయన కూతురు, సతీమణి, బ్రదర్స్ వాటాలపైనా ఆరోపణలు.. వీటిపై సీఎం మౌనం వహించడంలోని ఆంతర్యమేంది?
– కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో తెరిపినపడ్డ తెలంగాణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు లూటీలో పోటీపడుతూ తెర్లుచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలోని రాహుల్‌గాంధీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నారని, ఇద్దరూ కలిసి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోఖా ఇస్తే మూడేండ్లుగా ఆ పార్టీ ధోకా చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ గడ్డపై నిలబడి 420 హామీలిచ్చిన రాహుల్‌గాంధీ పత్తాలేకుండా పోయారని దెప్పిపొడిచారు. దేశమంతా తిరుగుతున్న ఆయన కోసం నాడు అశోక్‌నగర్‌లో చాయ్ తాగించిన యువకులు ఎదురుచూస్తున్నారని, జాబ్ క్యాలెండర్ అమలు చేయని ఆయనకు ముఖం చెల్లడంలేదని చురకలంటించారు.
రేవంత్ ప్రభుత్వం పంపుతున్న సొమ్ములు తీసుకుంటూ రాహుల్ మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. ఖైరతాబాద్‌కు చెందిన మైనారిటీ యువనేత జిబ్రాన్ షరీఫ్ ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్లో చేరగా ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, ఎన్నికల హామీల ఎగవేత, కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలపై వివరించారు. పింఛన్లను రెట్టింపు చేస్తామని, యువతులకు స్కూటీలు ఇస్తామని, రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని హామీలు గుప్పించిన కాంగ్రెస్, ఆచరణలో దారుణంగా విఫలమైందని విమర్శించారు. హామీల అమలు.. వరుస స్కామ్‌ల గురించి ప్రశ్నిస్తే రేవంత్‌రెడ్డి తిట్లు..అక్రమ కేసులతో బెదిరింపులకు దిగుతున్నాడని దుయ్యబట్టారు. ఆయనపెట్టే కేసులకు భయపడేది లేదని, బరాబర్ గల్లాపట్టి అడుగుతామని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి లేదు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాన ప్రతిక్షంగా ప్రజాసమస్యలపై కొట్లాడుతున్నది బీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. కరువుతో ప్రజలు అల్లాడుతుంటే రేవంత్‌రెడ్డి చిల్లరగా మాట్లాడి బీఆర్ఎస్పై నెపంనెట్టి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. నీళ్లు, కరెంట్ ఉన్నా ఇవ్వడం చేతగాకే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కన్నెపల్లికి వెళ్లి నీళ్లను చూపిస్తే కేసీఆర్‌కు పేరొస్తుందనే ఎత్తకుండా ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారని విమర్శించారు. నీళ్లు ఎత్తవచ్చని చెప్పిన పాపానికి రిటైర్డ్ ఇంజినీర్‌కు బెల్ట్ట్రీట్మెంట్ ఇస్తానని బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
బీజేపీవి విభజన రాజకీయాలు
ఓవైపు అభివృద్ధిని విస్మరించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుంటే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ‘డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒకటి హమ్లా..మరొకటి జుమ్లా’ అని దెప్పి పొడిచారు. పాలకుల వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం..అరెస్ట్‌లతో భయపెట్టడం లాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి ప్రతీకార రాజకీయాలు చేయలేదని గుర్తుచేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే శక్తిగా బీఆర్ఎస్ నిలుస్తుందని స్పష్టంచేశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలను ఎదుర్కొనే దమ్ము దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు లేదని స్పష్టంచేశారు. ఇతర పార్టీలే బీజేపీకి ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు.
స్కామ్‌లపై మౌనమెందుకు రేవంత్?
రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలపై సీఎం రేవంత్‌రెడ్డి మౌనం వహించడం శోచనీయమని కేటీఆర్ వాపోయారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ‘ఫోర్త్‌సిటీలో సీఎం రేవంత్ సోదరుడికి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయింపు.. అమెరికాలోని మరో తమ్ముడికి చెందిన కంపెనీతో రూ.1000 కోట్ల అగ్రిమెంట్.. ఆయన కూతురు..సతీమణిపై వస్తున్న ఆరోపణలపై స్పందించి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపినా మౌనం వహించడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించారు.
మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది?
మైనారిటీల సంక్షేమం కోసం హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్లో ఏటా రూ. 4,000 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ధోఖా చేసిందని దుయ్యబట్టారు. మూడేండ్లలో ఎన్నికోట్లు కేటాయించారు? ఎన్ని నిధులు ఖర్చు చేశారో? చెప్పాలని ప్రశ్నించారు. మహాలక్ష్మీ కింద ఇస్తానన్న స్కూటీలు, నెలకు రూ.2,500 ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీలను మోసం చేసిన సర్కార్‌కు తగిన బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు.
జిబ్రాన్ షరీఫ్ చేరికతో మరింత బలం
ఇప్పటికే నగరంలో బలంగా ఉన్న బీఆర్ఎస్కు మైనారిటీ యువనేత జిబ్రాన్ షరీఫ్ చేరికతో మరింత బలంపెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన గులాబీ పార్టీలోకి రావడం శుభసూచకమని వ్యాఖ్యానించారు. జిబ్రాన్ పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న మతసామరస్యం:మహమూద్ అలీ
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి వెల్లివిరిసిందని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ గుర్తుచేశారు. రేవంత్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని..మతసామరస్యం దెబ్బతిన్నదని విమర్శించారు. బీఆర్ఎస్సే అసలు సిసలైన సెక్యులర్ పార్టీ అనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం ఆగమైందని..కరెంట్, తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని వాపోయారు. ఈ పరిస్థితుల్లో ఎవరిని కదిలించినా మళ్లీ కేసీఆరే రావాలంటున్నారని చెప్పారు. మైనారిటీలకు కాంగ్రెస్ సర్కార్ దోఖా చేసిందని దుయ్యబట్టారు.
రేవంత్ ఉద్ధరించిందేం లేదు : తలసాని
మూడేండ్ల పాలనలో బూతులు మాట్లాడటం తప్ప రేవంత్‌రెడ్డి హైదరాబాద్ ప్రజలను ఉద్ధరించిందేంలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. కనీసం ఒక్క భవనమైనా కట్టని రేవంత్‌రెడ్డి, కేసీఆర్ కట్టిన భవనాలు..ఫ్లై ఓవర్లకు రిబ్బన్ కటింగ్‌లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని దెప్పిపొడిచారు. కేసీఆర్ చేసిన పనులను తాను చేసినట్టు చెప్పుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ‘రేవంత్‌రెడ్డి తీరు చూస్తుంటే సచివాలయాన్ని కూడా తానే కట్టినట్టు చెప్పుకొనేలా ఉన్నడు..కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డికి సిగ్గున్నదా?’ అంటూ తూర్పారబట్టారు.
కేసీఆర్..కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం : జిబ్రాన్ షరీఫ్
హైదరాబాద్‌లో కేసీఆర్..కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని జిబ్రాన్ షరీఫ్ పేర్కొన్నారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. రాష్ర్టానికి కేటీఆర్ ఐకాన్ అని అభివర్ణించారు. కేసీఆర్ పాలనలో ఐటీ మంత్రిగా అనేక పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు.
నాడు హైదరాబాద్‌కు భరోసా.. నేడు బర్బాద్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో కరెంటు కోతలు, నీటి కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టేవని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు, తాగునీరు సహా మౌలిక సదుపాయాల సమస్యలను పరిషరించేందుకు కృషి చేసిందని పేరొన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయకుండా, అన్నివర్గాల ప్రజలను కలుపుకొని పదేండ్లపాటు శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగించామని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరం గంగా-యమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిచేలా మత సామరస్యాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. కేసీఆర్ హైదరాబాద్ ప్రజలకు భరోసా ఇస్తే.. ప్రస్తుత సర్కార్ హైదరాబాద్‌ను బర్బాద్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని మెచ్చిన హైదరాబాద్ ప్రజలు పార్టీకి సంపూర్ణ మద్ద తు ఇచ్చారని, అన్ని అసెంబ్లీ స్థానాల్లో బ్ర హ్మాండమైన మెజారిటీతో గెలిపించారని గు ర్తుచేశారు. మోసపూరిత కాంగ్రెస్ జిల్లాల్లోని అమాయక రైతులకు ఆశలు కల్పించి.. ఆకాశంలోని చందమామను తెస్తామని భ్రమలు సృష్టించి గెలిచిందని దుయ్యబట్టారు.
2028లో మళ్లీ కేసీఆరే సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని కేటీఆర్ వివరించారు. పేదలు, రైతులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలపై జులుం చేసే వారిని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతూ రేవంత్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమ ని హెచ్చరించారు. ఏడాదిన్నరలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య క్తంచేశారు. 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, తెలంగాణను తిరిగి దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

