KTR | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బరాజ్ కుంగిపోవటం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిట్టనిలువునా, చెక్కుచెదరకుండా నిలబడిన మేడిగడ్డ బరాజ్ ఎన్నికల ముందే ఎలా కుంగిపోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని ఒకరిద్దరు మంత్రులు బరాజ్‌ను ఏదైనా చేయగల సమర్థులని, వారికి ఎవరెవరితో సంబంధాలున్నాయో తమకు తెలుసనని చెప్పారు. భవిష్యత్తులో మేడిగడ్డ బరాజ్‌కు ఏమి జరిగినా అది ప్రభుత్వ కుట్రఫలితమే అని భావించాల్సి వస్తుందని ఆయన తేల్చిచెప్పారు. శనివారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలని కాంగ్రెస్ నేతలు భావించారని, అందులో ఆ పార్టీ నేతలు విఫలం అయ్యారని అన్నారు. మేడిగడ్డ బరాజ్ పర్యటనకు తాము వెళ్లినపుడు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని, 28 లక్షల క్యూసెకుల ప్రవాహాన్ని మేడిగడ్డ బరాజ్ తట్టుకుని నిలబడిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.
ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డంపెట్టుకొని నీటిని ఎత్తిపోయటం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోయటానికి ప్రభుత్వానికి అహం అడ్డువస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఎల్లంపల్లి నుంచి నీరు ఎత్తిపోయటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 2 టీఎంసీలే ఎత్తిపోస్తే సరిపోదని, ఎల్లంపల్లిలో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయని చెప్పారు. 14 టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌కు నిలువ ఉంచాలని, మరో 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేశాక ఆపే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు, మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేయడం మినహా వేరే మార్గం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 40శాతం వర్షపాతం లోటు ఉందని, ఎన్నికలు లేనందున రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరువుకు ఇన్సూరెన్స్ అని అభివర్ణించారు. విద్యుత్ ఖర్చు ముఖ్యమా… రైతుకు నీళ్లు ఇవ్వటం ముఖ్యమా ? ఆయన ప్రశ్నించారు. గోదావరిలో 90 టీఎంసీల నీరు వృథాగా పోతున్నదని, ఆ నీరు శ్రీరాం సాగర్ ప్రాజెక్టుతో సమానమని గుర్తుచేశారు. భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. బహుళ ప్రయోజనాలున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులవుతున్నాయని ప్రభుత్వం బాధ పడుతున్నదని, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు లక్షా 50 వేల కోట్లు అవుతుందని, అదెవరికి లాభం? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ ఏ విషయంలో విభేదించినా కాళేశ్వరంపై ఒకే వైఖరితో ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ మాట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోట వెలువడినట్టే ఉందని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా నడుచుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పటంలో అర్థం అదేనన్నారు. కాళేశ్వరంపై కేంద్రం ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదని అది ఎన్డీయే రిపోర్ట్ అని ధ్వజమెత్తారు. పోలవరం కాఫర్‌డ్యామ్ కొట్టుకుపోయినపుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎకడ పోయిందని ప్రశ్నించారు.
మెట్రో అలైన్‌మెంట్‌ను ఎంఐఎం మార్చమని ఒత్తిడి చేయడం వల్లే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంకా ప్రతిపక్షనేత మూడ్‌లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎల్‌అండ్‌టీపై సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం వ్యాఖ్యలతో పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ముఖ్యమంత్రే అలా వ్యాఖ్యానిస్తే రాష్ర్టానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా క్యాన్సర్…ఎయిడ్స్‌తో పోలుస్తారా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? అని ధ్వజమెత్తారు. హుస్సేన్ ఇ-షా-వలీ దర్గాపై తాము సుప్రీం కోర్టులో వేసిన అఫడవిట్ సరైందేనని సమర్థించారు. అందుకు భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తారా అని ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టులో రెయిల్ కారిడార్ ఉందని, భూ సేకరణలో ఇబ్బందులు ఉండవని ఎయిర్‌పోర్టుకు ఆ మార్గంలో మెట్రో ప్రతిపాదించామని చెప్పారు. తాము విజయవంతంగా అమలు చేస్తున్న ప్రాజెక్టులకు పేర్లు మార్చటం మినహా ఈ ప్రభుత్వం చేసింది ఏమిటని ప్రశ్నించారు. హైడ్రా పేరు మారిన పథకాల్లో ఒకటని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి ఏం చేస్తున్నారో తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. వారి బాగోతాలు అవసరమైనప్పుడు బయటపెడతామని హెచ్చరించారు. ఉదయసింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ధరణి స్థానంలో ఏది వచ్చినా భూమేతే అవుతుందని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాల తరువాత తాను ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటానని కేటీఆర్ వెల్లడించారు. ఈ ప్రభుత్వం ఐదేండ్లు పూర్తి చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. శ్వేతపత్రాలతో సీఎం రేవంత్‌రెడ్డి శోధించి సాధించేదీ ఏమీలేదన్నారు. ఉదయ్ సీంపై అంశాన్ని మోటర్లకు మీటర్లకు ఒప్పందంతో ముడిపెట్టి సీఎం సభను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు.
నీళ్లున్నప్పుడే ఖాళీ ప్రాజెక్టులు నింపిపెట్టాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. బరాజ్ గేట్లు తెరిచి ఉన్నా నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారని, సెప్టెంబర్‌లో నీళ్లు లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఉన్నదని అది సరికాదన్నారు. కాళేశ్వరం నీటి విడుదల విషయంలో ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టామని, అప్పటికీ విడుదల చేయకపోతే పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటి విడుదలపై కార్యాచరణ ప్రకటిస్తామని పునరుద్ఘాటించారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు నిర్మించినా తాము సరిగా ప్రచారం చేసుకోలేకపోయామని, తాము చేసిన పనులను సరిగా చెప్పుకోలేకే ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు.