కేన్స్ టెక్నాలజీ గుజరాత్‌కు, కార్నింగ్ సంస్థ చెన్నైకి తరలిపోయింది. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానంటున్నది. అదే జరిగితే తెలంగాణ బ్రాండ్‌కు తీరని నష్టం జరుగుతుంది.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బ్రాండ్ తెలంగాణను కాపాడాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే అంతకన్నా దురదృష్టకరం మరోటి ఉండదని, ఇది విపత్తులాంటిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అర్థంకాక చాలాసంస్థలు రాష్ర్టాన్ని వీడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్‌కు, కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని ఉదహరించారు.
తాజాగా అమరరాజా వెళ్లిపోతానని చెప్పటం తెలంగాణ బ్రాండ్‌కు నష్టమని చెప్పారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ పాలసీలు ఉండాలని పేర్కొన్నారు.రాష్ట్రంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా అమరరాజా సంస్థను ఎంతో కష్టపడి ఒప్పించామని, ప్రభుత్వం మారిన తర్వాత ఆ సంస్థ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు.
సంస్థ విషయం లో కాంగ్రెస్ సర్కారు సానుకూలంగా స్పందించాలని సూచించారు. అమరరాజా సంస్థ తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. రాష్ర్టానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.