హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఉగ్రవాదం ప్రపంచ సమస్యగా పరిణమిస్తున్నదని, దాని వ్యాప్తిని నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు పసిగట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ రాజేన్ హర్షే సూచించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం రాష్ట్ర పోలీసు అకాడమీ ఆధ్వర్యంలో కేఎస్ వ్యాస్ 25వ స్మారక ఉపన్యాస సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేన్ హర్షే ‘ప్రపంచీకరణ, ఉగ్రవాదం’ అనే అంశంపై మాట్లాడారు.
ఉగ్రవాద సంస్థల వ్యూహాలు, వాటిని ఛేదించే క్రమంలో భద్రతా సంస్థల ప్రతిస్పందనలను రూపొందించడంలో సాంకేతికత, కమ్యూనికేషన్ నెట్వర్క్ల వినియోగం, ఆర్థికంగా పరస్పర సహకారం గురించి వివరించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. అసాధారణ దూరదృష్టితో గ్రేహౌండ్స్ ఆవశ్యకతను ఊహించి, దాన్ని కేఎస్ వ్యాస్ స్థాపించారని, దాని ద్వారా పోలీసులకు కఠోర శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కేఎస్ వ్యాస్ గొప్పతనాన్ని రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ వివరించారు.