హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఏర్పాటుకు కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్(కేఆర్టీఏ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో కేఆర్టీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల, సెక్రటరీ జనరల్ ఈవీ సతీశ్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. జనతాదళ్(ఎస్) హయాంలో ‘పంపన తెలంగాణభవన్’ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎకరం భూమిని టీఆర్ఎస్ సహకారంతోనే సాధించామని చెప్పారు.
కర్ణాటకలో ఉన్న తెలంగాణ వారి సంక్షేమం కోసం 2012లో ఏర్పడిన కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ సంస్కృతిని కన్నడగడ్డపై చాటిచెప్తున్నదని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాలు, అలయ్-బలయ్ వేడుకలను ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో కేవలం బెంగళూరులోనే కాకుండా నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానం పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో కేఆర్టీఏకు శాఖలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో కేటీఆర్టీఏ సభ్యులు విజయ్‌రెడ్డి, భవ్య, నాగలక్ష్మి, మధు, లక్ష్మణయాదవ్, కేఆర్టీఏ బీదర్ సెక్రటరీ సుదర్శన్, సుందర్ చాగంటి తదితరులు పాల్గొన్నారు.