హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని, ఆ దిశగా బోర్డు చర్యలు తీసుకోవాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్‌ను సోమవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని గత వైసీపీ సర్కార్ ప్రతిపాదనను పునఃసమీక్షించాలని కోరారు. నాగార్జునసాగర్ నుంచి మూడో జోన్‌కు నీటిని విడుదల చేయించి పంటలను రక్షించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో గతంలో మాదిరిగానే ఏపీకి 512 టీఎంసీల వాటాను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సాగర్ కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు, వైస్ చైర్మన్ ఉప్పలపాటి చక్రపాణి, యార్లగడ్డ రవిబాబు, కొమ్మారెడ్డి రాజేశ్, దేవినేని సత్యనారాయణ, పామర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.