హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): చెన్నై నగరానికి తాగునీరు సరఫరా చేసే అంశంపై 23న నిర్వహించనున్న సమావేశం ఎజెండాను కేఆర్ఎంబీ ఖరారు చేసింది. ఈ మేరకు కృష్ణా బేసిన్ రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై తాగునీటి కోసం 15 టీఎంసీలను సరఫరా చేయాల్సిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చెన్నైకి నీటి సరఫరా యాక్షన్ ప్లాన్‌పై చర్చించి, షెడ్యూల్‌ను నిర్ణయించనున్నారు. కృష్ణా జలాల వినియోగ డాటాను బేసిన్ రాష్ర్టాలు పరస్పరం పంచుకొనే అంశంపై అభిప్రాయాలను తెలపాలని కేఆర్ఎంబీ సూచించింది. కండలేరు నుంచి శ్రీశైలం రిజర్వాయర్ వరకు తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన పైప్‌లైన్ నిర్మాణంపైనా చర్చించనున్నారు.