నందికొండ, జూన్ 17 : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అశోక్‌గోయల్ సోమవారం నాగార్జున సాగర్ డ్యామ్‌ను సందర్శించారు. డ్యామ్, గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, స్పిల్‌వే, ప్రధాన జల విద్యుత్తు కేంద్రాలను పరిశీలించి, నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టులోకి నీరు వచ్చే వరకు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించారు. ఆయన వెంట కేఆర్ఎంబీ సభ్యుడు సంకువ, ఎస్ఈ వరలక్ష్మీదేవి, డీఈ అజయ్, ఏఈ రాజేశ్‌చారి, ఎన్ఎస్పీ ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ మల్లికార్జున, డీఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.