హైదరాబాద్/ మహబూబ్‌నగర్, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణకు ఏపీ మరోసారి దగాచేస్తున్నది. మన నీటిహక్కులకు గండికొడుతూ కృష్ణా జలాలను బాబు సర్కారు యథేచ్ఛగా మళ్లించుకు పోతున్నది. ఈ ఏడాది జూన్ మొదటివారం నుంచే కృష్ణా బేసిన్లో వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ, లక్షల క్యూసెక్కుల్లో వరద కొనసాగుతుండగా, వచ్చిన వరదను వచ్చినట్టుగా రాయలసీమకు తరలి స్తున్నది. జూరాల వైపు నుంచి 275 టీఎంసీలు, తుంగభద్ర నుంచి 65 టీఎంసీలు పోయినాక కూడా శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో వదిలితే నాగార్జునసాగర్ ఎప్పుడో నిండిపోవాలి. కానీ, ఏపీ వైపు ఉన్న పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రీనీవాతోపాటు సుంకేసుల జలాశయం నుంచి కేసీ కెనాల్ ద్వారా మొత్తంగా సుమారు 100 టీఎంసీల నీటిని తరలించుకుపోయినట్టు అనధికారిక సమాచారం.
శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 44,000 క్యూసెకులు తరలించుకునే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 40వేల క్యూసెక్కులను తరలిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లా ముచ్చుమర్రి వద్ద ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిర్మించారు. శ్రీశైలం జలాశయంలోని 798 అడుగుల నీటిని పంపింగ్ చేయడానికి ఈ పథకాన్ని ప్రతిపాదించారు. కేసీకెనాల్ కింద 49,440 ఎకరాల ఆయకట్టు అవసరాలను తీర్చడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో పొడవైన కాలువ. శ్రీశైలం జలాశయం నుంచి వరద నీటిని మళ్లించి, సాగునీరు, తాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. కాలువ మొదటి దశ మల్యాల వద్ద మొదలై, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ పారుతుంది. ప్రస్తుతం రెండు నదుల నుంచి ఆయా కాలువలకు నీటిని మళ్లిస్తున్నారు.
కృష్ణా, తుంగభద్ర నదులకు ఈ ఏడాది మే చివరి వారంలో వరద ప్రవాహం మొదలైంది. ఏపీ వైపు తుంగభద్ర, కృష్ణా నదులపై భారీ ఎత్తుపోతల పథకాలు ఉన్నప్పటికీ, తెలంగాణ వైపు మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తుంగభద్రపై ఒకటి, జూరాల నుంచి శ్రీశైలం వైపు మరొకటి ఉన్నాయి. తుంగభద్రపై కర్ణాటక ప్రాంతంలో ఆర్డీఎస్ ఆనకట్ట నిర్మించారు. కర్ణాటక నుంచి మొదలయ్యే ఈ కాలువ పొడ వు 143 కిలోమీటర్లు. అలంపూర్ నియోజకవర్గంలో ఈ కాలువ 60 కిలోమీటర్ల పొడవున ఉంటుంది.
రోజుకు తుంగభద్ర నుంచి 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాగు, తాగునీటి కోసం ఉద్దేశించినది. అయితే, వరద సమయాల్లో కేవలం 1,500 క్యుసెక్కుల నీటిని వదులుతారు. ఏడాది 40 రోజుల వరకు నీటిని విడుదల చేయకుండా నిలిపివేయడంతో విమర్శలొచ్చాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరికల నేపథ్యంలో జూలై 8న నీళ్లు విడుదల చేశారు. ఇప్పటివరకు మూడు టీఎంసీల నీటిని మాత్రమే ఈ ఎత్తిపోతల నుంచి వినియోగించుకోగలిగాం. దాని సామర్థ్యం రోజుకు 1,500 క్యూసెకులు.
వాస్తవానికి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ వద్ద నీటి విడుదల గణాంకాల నమోదుకు టెలీమెట్రీల వ్యవస్థను మొదటి దశలో 2018లోనే ఏర్పాటుచేశారు. అయితే, ఈ వ్యవస్థ ఏమాత్రం సవ్యంగా లేదని కేఆర్ఎంబీ ఏర్పాటుచేసిన కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. పోతిరెడ్డిపాడు దిగువన 600వ మీటర్ వద్ద ఏర్పాటుచేయాల్సిన టెలిమెట్రీలను ఏకంగా 12.26 కిలోమీటర్ వద్దకు మార్చారని, ఆ పాయింట్ సరికాదని, అక్కడ అమర్చిన నాన్ కాంటాక్ట్ రాడార్ వెలాసిటీ సెన్సార్ కూడా అంత అనువైనది కాదని స్పష్టంచేసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం వద్ద తప్ప మిగిలిన ఎక్కడా టెలీమెట్రీలు కచ్చితమైన నీటిప్రవాహ సామర్థ్యాన్ని సూచించడం లేదని తెలిపింది. అనువైన ప్రాంతాల్లో, అనువైన సెన్సార్లను ఏర్పాటుచేయాలని సిఫారసు చేసింది. దీంతో టెలీమెట్రీలు అందుబాటులోకి వచ్చే వరకూ ఇరు రాష్ర్టాల అధికారుల ఆధ్వర్యంలోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్‌లు లెక్కగట్టిన నీటి గణాంకాలనే అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని అప్పుడే నిర్ణయించారు.
నాటినుంచీ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ అందజేస్తున్న గణాంకాలను ఎప్పటికప్పుడు కేఆర్ఎంబీ వెబ్సైట్లో పొందుపరుస్తూ వస్తున్నది. అయితే, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ సరారు వచ్చాక మాన్యువల్‌గా కూడా గణాంకాలను తీసుకోవడం లేదని, ఏపీ ఇచ్చిన లెక్కలనే బోర్డు నమోదుచేస్తున్నదని అధికారులు చెప్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం వైపు వస్తున్న వరదను ఏపీ తరలించకొనిపోతున్నా ఆ లెకలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, శ్రీశైలం నీటిపారుదల అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు.
ఇండెంట్లు లేవు. త్రిసభ్య కమిటీ చర్చల్లేవ్. నీటి విడుదల ఆర్డర్లు లేవు. అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాల తరలింపును అప్పుడే ప్రారంభించింది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి 23 టీఎంసీలను మళ్లించగా, తాజాగా నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి జలాల మళ్లింపునకు పూనుకున్నది. ఏపీని నిలువరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, నీటి మళ్లింపును ఆపాలంటూ ఏపీ సర్కారుకు కేఆర్ఎంబీ లేఖలు రాసి చేతులు దులుపుకున్నాయి తప్ప తీసుకున్న చర్యలు శూన్యం. వాస్తవానికి, ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ 1 నుంచి మే 31 వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది.
బోర్డు సభ్య కార్యదర్శి, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లతో కూడిన ఈ కమిటీ ప్రతి ఏటా సీజన్లవారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. రాష్ర్టాల డి మాండ్లను, అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాలకు నీటి వాటాలను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదల చేస్తూ బోర్డు ఆర్డర్ జారీ చేస్తుంది. కానీ, ఈ ఏడాది నీటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదు. ఇరు రాష్ర్టాలూ నీటి ఇండెంట్లను బోర్డుకు సమర్పించలేదు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం అప్పుడే శ్రీశైలం నుంచి కృష్ణా జలాల మళ్లింపునకు పూనుకున్నది.
ఇండెంట్ లేకుండా, నీటి విడుదల ఉత్తర్వులు లేకుండా ఏపీ జలాల మళ్లింపు చేపట్టినా కేఆర్ఎంబీ చోద్యం చూస్తున్నది. 20 రోజులుగా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. ఏపీ జలాల మళ్లింపుపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీని నిలువరించాలని కోరుతూ లేఖ రాసింది. దీనిపై స్పందించిన బోర్డు.. తెలంగాణ రాసిన లేఖను ఉటంకిస్తూ నీటి మళ్లింపును నిలిపేయాలని మొక్కుబడిగా ఏపీకి లేఖ రాసింది. అంతేతప్ప, నీటి మళ్లింపును నిలువరించే దిశగా బోర్డు ఎలాంటి చర్యలకూ పూనుకోలేదు. గత సంవత్సరం సైతం ఇలాగే వ్యవహరించింది. గత నీటి సంవత్సరంలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే ఎనిమిది నెలల కాలంలోనే ఏపీ 240 టీఎంసీలకుపైగా జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించింది. దిగువన నాగార్జున్‌సాగర్ వద్ద కుడికాలువ, పంప్‌హౌజ్ ద్వారా కూడా కృష్ణా జలాలను ఏపీ నిరంతరాయంగా తరలిస్తూనే ఉన్నది. మొత్తంగా 650 టీఎంసీలకుపైగా జలాలను ఏపీ తరలించినట్టు అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. మళ్లిస్తున్న జలాలకు సంబంధించిన లెక్కలనూ కచ్చితంగా వెల్లడించని దుస్థితి నెలకొన్నది.
శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ (పీఆర్పీ), తెలుగుగంగా ప్రాజెక్టు (టీజీపీ), ఎస్ఆర్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్), మల్యాల, ముచ్చమర్రి లిఫ్ట్‌లు ఉన్నాయి. వీటిలో టీజీపీకి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు మొత్తంగా 34 టీఎంసీలు మాత్రమే నీటి కేటాయింపులు ఉన్నాయి. వాటిని కూడా ఏకకాంలో కాకుండా నిర్ణీత కాలంలో, నిర్దేశిత పరిమాణంలో మాత్రమే పీఆర్పీ నుంచి తరలించాల్సి ఉన్నది. ఇవికాకుండా, మిగతా ఔట్‌లెట్లన్నీ వరద జలాలపై ఆధారపడి నిర్మించినవే. అంటే బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండిన తరువాత, దిగువకు సముద్రంలోకి నీటిని విడుదలచేస్తున్న సమయంలో ఆయా ఔట్లెట్ల ద్వారా ఏపీ జలాలను మళ్లించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఏపీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
ఇప్పటికీ నాగార్జునసాగర్, దాని దిగువన పులిచింతల ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకోలేదు. రెండింటిలో కలిపి ఇంకా 75 టీఎంసీల లోటు ఉన్నది. అయినప్పటికీ, ఏపీ మాత్రం జూలై 6 నుంచే పీఆర్పీ నుంచి జలాల మళ్లింపును చేపట్టింది. గడచిన 20 రోజుల్లో 23 టీఎంసీలను మళ్లించింది. అంతేకాకుండా, మల్యాల లిఫ్ట్ ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్)కి నీళ్ల మళ్లింపును ప్రారంభించింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే కాకుండా ఇప్పుడు నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కూడా కృష్ణా జలాలను తరలింపును ప్రారంభించింది.
సుంకేసుల: తుంగభద్ర నదిపై కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన సుంకేసుల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలు. రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ కేసీ కాలువ పొడవు 305 కిలోమీటర్లు. దీని కాలువ సామర్థ్యం 4000 క్యూసెకులు కాగా రోజుకు 3 వేల క్యూసెకులు తరలిస్తున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం: ఈ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకు ఆనుకొని నిర్మించారు. ఈ పథకం పనులు దాదాపు 90% పూర్తయ్యాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో సంగమేశ్వరం వద్ద కాలువ ప్రారంభమై రాయలసీమ ఎత్తిపోతల పథకం వరకు సుమారు 12 కిలోమీటర్లు నదిలో లోతైన కాలువ చేసి ఈ పథకాన్ని జీరో లెవెల్లో కూడా నీటిని తరలించేందుకు ఏర్పాటుచేశారు. అడ్డు గోడ తొలగిస్తే చాలు నీళ్లన్నీ రాయలసీమ వైపు వెళ్లిపోతాయి.
హంద్రీనీవా: రాయలసీమ సుజల స్రవంతి పథకం కింద రోజుకు 9,000 క్యూసెకుల నీటిని కృష్ణా నదిలో భారీ కాలువలను తవ్వి.. నీటిని రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాలకు తరలిస్తున్నారు.
ముచ్చుమర్రి: నందికొటూరు మండలం మాల్యాల గ్రామ సమీపంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కింద శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రోజుకు నాలుగు వేల క్యూసెకులు పంపింగ్ చేస్తున్నారు.