హైదరాబాద్, నవంబర్7 (నమస్తే తెలంగా ణ): సాగునీటి ప్రాజెక్టుల నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో ఆపరేషన్ ప్రొటోకాల్ దోహదపడుతుందని, తెలంగాణకు సంబంధించిన మైనర్, మీడియం ప్రాజెక్టులతోపాటు, కృష్ణా డెల్టా సిస్టమ్ నీటివినియోగానికి చెందిన సక్సెస్‌రేటును అధ్యయనం చేయకుండా, కేవలం ట్రిబ్యునళ్ల నీటికేటాయింపుల ఆధారంగానే ప్రొటోకాల్‌ను ప్రతిపాదించానని ఏపీ తరపున సాక్షి, చీఫ్ ఇంజినీర్ అనిల్‌కుమార్ గోయెల్ వెల్లడించారు. ఆవిరి నష్టాలను నీటివాటాల్లోనే లెక్కించాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ ఎదుట వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణాజలాలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయడంతోపాటు, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు సంబంధించిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో రెండోరోజైన గురువారం కొనసాగింది. ఏపీ తరపున ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ప్రతిపాదించిన చీఫ్ ఇంజినీర్ అనిల్‌కుమార్ గోయెల్‌ను తెలంగాణ తరపున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్, నీటివాటాల పంపిణీ, నీటివినియోగం తదితర అంశాలపై గోయెల్ తన అఫిడవిట్లో ప్రతిపాదించిన అంశాలపై ప్రశ్నించారు.
తెలంగాణకు సంబంధించిన మైనర్, మీడియం నీటివినియోగం సక్సెస్‌రేట్‌ను విశ్లేషించారా ? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ చేయలేదని ఏపీ తరపున సాక్షి గోయెల్ తెలిపారు. 1972 నుంచి 2007-08 వరకు దాదాపు 29ఏళ్ల నీటి వినియోగ గణాంకాలను పరిశీలిస్తే మైనర్, మీడియం ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ కేటాయించిన జలాల కంటే తెలంగాణ చాలా తక్కువ జలాలను వినియోగించుకుందని, అవేవీ లేకుండా ట్రిబ్యునల్ ఎదుట ఒక నిపుణులుగా ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ఎలా ప్రతిపాదించారని తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ ప్రశ్నించారు.
తాను ప్రతిపాదించిన ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రధానంగా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు మాత్రమే సంబంధించి ట్రిబ్యునళ్లు చేసిన నీటి కేటాయింపుల ఆధారంగా రూపొందించానని గోయెల్ వెల్లడించారు. మైనర్, మీడియం ప్రాజెక్టుల నీటివినియోగాలు తెలంగాణ, ఏపీలో ఒకేవిధంగా లేవని, కాబట్టి ప్రస్తు తం ఏవిధంగా ఆయా మైనర్, మీడియం ప్రా జెక్టులను ఆపరేట్ చేస్తున్నారో అదేవిధంగా ఇక ముందూ ఆపరేట్ చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా కామన్ రిజర్వాయర్లలో వ ర్షాభావపరిస్థితుల్లో నీటి వినియోగ సంబంధిత అంశాలపై కూడా ప్రశ్నలను సంధించారు.
కృష్ణా డెల్టా సిస్టమ్‌కు మొత్తంగా 152.20టీఎంసీలను కేటాయించారని, కాలువల ఆధునికీకరణ వల్ల కేవలం 132.9టీఎంసీలు సరిపోతాయని 1995లో రిపోర్ట్ చేశారని, మొత్తంగా ఆధునికీకరణతో నీటివినియోగాన్ని తగ్గించవచ్చనేది తేలిపోయింది కదా అని వైద్యనాథన్ ప్రశ్నించగా, అందుకు ఏపీ తరపు సాక్షి గోయెల్ కూడా అంగీకరించారు. 1995 కంటే ప్రస్తుతం ఇంకా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, ఆయా పద్ధతులను అమలు చేస్తే కేడీఎస్‌కు 130టీఎంసీలుకు మించి అవసరం ఉండబోదని, దీనిపై ఏమంటారని ప్రశ్నించగా, దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని గోయెల్ వివరించడం గమనార్హం.