హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఉనికిలో ఉన్నదా? లేదా? ఉంటే ఏం చేస్తున్నది? కుడికాలువ ద్వారా ఏపీ యథేచ్ఛగా నీళ్లను తరలించుకుపోతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నది? ఇదీ తెలంగాణ ఇరిగేషన్ అధికార యంత్రాంగం, రైతులు వేస్తున్న ప్రశ్నలు. బోర్డు నిర్వాకం వల్ల రిజర్వాయర్ మొత్తం ఖాళీ అయిపోయి ఇప్పుడు రాష్ట్రంలో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నది. కృష్ణా బోర్డు ఏపీకి వంతపాడుతూ తెలంగాణను ఎండబెడుతున్నదని రైతాంగం మండిపడుతున్నది.
ఏపీకి వంతపాడుతూ..
తెలుగు రాష్ర్టాల మధ్య నీటివాటాలను తేల్చడం, ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి ఆ మేరకు నీటి విడుదలను పర్యవేక్షించడం కేఆర్ఎంబీ విధి. కానీ ఈ ఏడాది ఎక్కడా ఆ పని చేయలేదు. నీటివాటాలను రాష్ర్టాలే తేల్చుకోవాలని చేతులెత్తేసింది. నీటివిడుదలనూ పర్యవేక్షించిన దాఖలాల్లేవు. కోటాకు మించి ఏపీ జలాలను తరలిస్తున్నా, ఆ రాష్ర్టాన్ని నిలువరించాలని తెలంగాణ లేఖలపై లేఖలు రాసినా ఏమాత్రం చలనం లేకుండాపోయింది. వాస్తవంగా సాగర్ డ్యామ్ కేంద్ర సాయుధ బలగాలు (సీఆర్పీఎఫ్)చేతిలో ఉన్నది. డ్యామ్‌పై ఎవరు అడుగు పెట్టాలన్నా, హెడ్ రెగ్యులేటరీ గేట్లను తెరవాలన్నా, మూయాలన్నా తమ అనుమతి అవసరమని ఈ ఏడాది జనవరి 17న బోర్డు వెల్లడించింది. బోర్డు అనుమతి ఉత్తర్వులు ఉంటేనే ఎవరినైనా సరే డ్యామ్‌పైకి అనుమతించాలని సీఆర్పీఎఫ్ బలగాలకూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ రివర్ బోర్డు గత ఆదేశాలన్నీంటినీ తుంగలో తొక్కింది. సాగర్ కుడికాలువ గేట్లను ఏపీకి అప్పగించినట్లుగా తెలుస్తున్నది. ఏపీ అధికారులు నిరాటంకంగా గేట్లను ఆపరేట్ చేస్తూ సాగర్ జలాలను తరలించుకుపోతున్నారు. అయినప్పటికీ ఏపీకి వంతపాడుతూ బోర్డు ఏమాత్రం ఉలుకూ పలుకుండా ఉండిపోయింది.
నీటి విడుదలకు ఉత్తర్వులేవీ?
ట్రిబ్యునల్ కేటాయింపులు లేని నేపథ్యంలో ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ నుంచి మే 31 వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటినిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. రాష్ర్టాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాలకు నీటివాటాలు కేటాయిస్తుంది. కానీ ఈ ఏడాది యాసంగి సీజన్ అక్టోబర్‌లో ప్రారంభమైన నాటి నుంచి రివర్ బోర్డు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సాగర్ జలాశయం నిల్వలు అడుగంటే దశలో బోర్డు హడావుడి చేసింది. అప్పటికీ త్రిమెంబర్ కమిటీని ఏర్పాటు చేయకుండా, కేవలం ఫిబ్రవరి 27వ తేదీన చివరిసారి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇరు రాష్ట్రాలే వివాదాలు లేకుండా వినియోగించుకోవాలని తన బాధ్యత నుంచి తప్పుకుని చేతులు దులుపుకుంది. అప్పటికే ఏపీ దాదాపు కోటాకు మించి జలాలను కుడికాలువ ద్వారా తరలించుకుపోయింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకోసారి భేటీ కావాలని, ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఇరు రాష్ట్రాలకు సూచించి బోర్డు సమావేశాన్ని ముగించింది.
అడిగినా స్పందించదు..
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నోరు మెదపకపోవడం, బోర్డు అడ్డు చెప్పకపోవడంతో కృష్ణాజలాల తరలింపులో ఈ ఏడాది ఏపీ సర్కారుకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. సాగర్ కుడి కాలువ కింద ఏపీకి వాస్తవంగా 132 టీఎంసీల కేటాయింపు ఉంది. కానీ ఇప్పటివరకే 185 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించింది. ఫిబ్రవరి 27న నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగింది. ఆ సందర్భంగా కుడికాలువ నుంచి రోజుకు 5000 క్యూసెక్కులనే డ్రా చేయాలని బోర్డు చైర్మన్ నిర్ణయించారు. కానీ ఏపీ ఇప్పటికీ తగ్గించలేదు. శుక్రవారం సాయంత్రానికి సైతం ద్వారా రోజుకు 6700 క్యూసెక్కులను డ్రా చేస్తుండటం గమనార్హం. దీనిపై ఏపీ అధికారులు ఫోన్ చేసినా స్పందించడం లేదని, వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని బోర్డు అధికారులను డిమాండ్ చేసినా చైర్మన్ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర అధికారులు వాపోతున్నారు. అదీగాక నీటి పంపకం విషయాన్ని మీరే తేల్చుకోవాలంటూ బోర్డు చైర్మన్ చేతులెత్త్తేశారని అంటున్నారు.
ప్రశ్నించని కాంగ్రెస్ సర్కారు..
ఏపీ బరితెగింపునకు, బోర్డు వ్యవహారశైలికి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు వైఫల్యమే కారణమని ఇటు అధికారులు, అటు రైతుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. వాస్తవంగా ఏపీ కోటాకు మించి జలాలను తరలించుకుపోతున్నదని రాష్ట్ర అధికారులు నవంబర్ నెల నుంచే అటు బోర్డుకు, ఇటు తెలంగాణ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొస్తున్నారు. పదుల సంఖ్యలో లేఖలు కూడా రాశారు. ఏపీని అడ్డుకోవాలని ఉన్నతాధికారులు నేరుగా బోర్డు చైర్మన్‌ను ఇటీవల కలిశారు. దాదాపు 15 రోజులు గడిచిపోయాయి. అయినా సర్కారులో చలనం లేకుండా పోవడం గమనార్హం. తెలంగాణ సర్కారు నిర్లిప్తత వల్ల ఏపీ ఇప్పటికే సాగర్ రిజర్వాయర్‌ను ఖాళీ చేయగా, ఎడమ కాలువ ఆయకట్టు కింద పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తింది. వేసవిలో తాగునీటికి ప్రమాదం ఏర్పడింది.