Banakacherla | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే, పోలవరం ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) నుంచి మళ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) స్పష్టంచేసింది. బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలన్నీ మారిపోతాయని, కాబట్టి అందుకు అన్ని రాష్ర్టాల సమ్మతి తప్పనిసరి అని బోర్డు తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కి తాజాగా లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫిజబులిటీ రిపోర్టు)ను కేంద్ర జల్‌శక్తి శాఖకు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై అభిప్రాయాలు తెలపాలని కేంద్ర జలసంఘం, ఎన్డబ్ల్యూడీఏతోపాటు కృష్ణా, గోదావరి రివర్‌బోర్డులకు, అన్ని రాష్ర్టాలకు సూచించింది. పీఎఫ్ఆర్ రిపోర్టు కాపీని పంపింది. దీంతో బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేఆర్ఎంబీ తాజాగా తన పరిశీలనలను సీడబ్ల్యూసీకి పంపింది.
బనకచర్ల లింక్ ప్రాజెక్టును గోదావరి బేసిన్‌లోని పోలవరం నుంచి చేపడుతున్నారని, కృష్ణా నదికి జలాలను మళ్లించి, తుదకు పెన్నా బేసిన్ కు తరలించనున్నారని వివరించింది. అయితే, గోదావరి జలాల మళ్లింపుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలు పూర్తిగా మారిపోతాయని వెల్లడించింది. గోదావరి బనకచర్ల లింక్ చేపడితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు, ప్రస్తుతం ప్రతిపాదించిన పనులకు ఏమాత్రం పొంతన ఉండబోదని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా డిజైన్లతోపాటు కాలువ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలంటే మరోసారి టీఏసీ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు బేసిన్‌లోని అన్ని రాష్ర్టాల సమ్మతి తప్పనిసరి అని, ఆయా రాష్ర్టాలతో చర్చించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
45 టీఎంసీల వాటానే తేలలేదు
గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లిస్తే, ఆ మళ్లించే జలాల్లో కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని, ఈ మేరకు బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా తెలియజేసిందని కేఆర్ఎంబీ గుర్తుచేసింది. గతంలో పోలవరం నుంచి 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు మళ్లించగా, అందులో 45 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి, మిగతా 35 టీఎంసీల్లో 21 టీఎంసీలను కర్ణాటకకు, 14 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించిందని తెలిపింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీల వినియోగంపై ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతున్నదని, అదే ఇప్పటికీ తేలలేదని సీడబ్ల్యూసీకి బోర్డు తెలిపింది. అదేవిధంగా ప్రస్తుతం గోదావరి నుంచి 200 టీఎంసీలను కృష్ణా మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ బనకచర్లను చేపడుతున్నదని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో మళ్లింపు గోదావరి జలాల్లోనూ కృష్ణా బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలకు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం, గత 80 టీఎంసీల నిష్పత్తిలోనే వాటా ఇవ్వాల్సి ఉంటుందని బోర్డు తేల్చిచెప్పింది. కానీ, బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల్లో ఏపీ ఆ వాటాల సంగతిని ప్రస్తావించలేదని వివరించింది. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక ముందుకు పోవాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. సీడబ్ల్యూసీకి తెలిపినట్టు సమాచారం. లేదంటే రాష్ర్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందని కూడా బోర్డు ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.
ఇదే విషయాన్ని ఇప్పటికే తేల్చిచెప్పిన జీఆర్ఎంబీ
ఇదిలావుండగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సైతం సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్లోని అనేక అంశాలపై సందేహాలను, సాంకేతికపరమైన అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ప్రాజెక్టుకు అనుమతులివ్వకూడదని పరోక్షంగా సూచించింది. ప్రధానంగా బనకచర్ల లింక్ ప్రాజెక్టును పోలవరం నుంచి చేపడుతున్నారని, లింక్ ప్రాజెక్టు వల్ల పోలవరం ప్రాజెక్టు స్వరూపం, కాలువలు, తదితర సామర్థ్యాలన్నీ మారిపోతాయని, కాబట్టి ఆ మేరకు కొత్తగా మరోసారి టీఏసీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఇప్పటికే అనుమతులకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ చేపడుతున్నదని, దీనిపై అనేకసార్లు ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. అంతేకాకుండా, లింక్ ప్రాజెక్టు వల్ల ప్రాజెక్టు ఆపరేషన్స్ షెడ్యూల్ కూడా మారుతుందని, అందుకు గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ర్టాల సమ్మతి తప్పనిసరి అని, ఆయా రాష్ర్టాలతో చర్చించాల్సి ఉంటుందని జీఆర్ఎంబీ స్పష్టంచేసింది. అదేవిధంగా గోదావరిలో వరద జలాలు ఎన్ని, మిగులు జలాలు ఎన్ని? అనే అంశాన్ని తేల్చాల్సి ఉంటుందని, వరద జలాల గుర్తింపు, తరలింపుపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని కూడా తెలిపింది. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాతే ముందుకు పోవాల్సి ఉంటుందని బోర్డు స్పష్టంచేసినట్టు సమాచారం. లేదంటే రాష్ర్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందని కూడా బోర్డు ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.