హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీ తన తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతున్నదని.. దీనిపై మీ వైఖరి తెలుపాలంటూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తెలంగాణ ప్రభుత్వానికి లేఖరాసింది. ఏపీ ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తన కోటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నది. మే నెలలో తాగునీటి అవసరాల కోసం అదనంగా 6-7 టీఎంసీలు విడుదల చేయాలని కేఆర్ఎంబీని కోరింది. దీంతో నీటి విడుదలపై వైఖరి తెలుపాలంటూ కృష్ణాబోర్డు తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నెల 9న జరిగిన త్రిసభ్యకమిటీ భేటీలో శ్రీశై లం, సాగర్‌లో నీటి వినియోగంపై చర్చ జరిగింది. శ్రీశైలంలో ఇప్పటికే కనీస స్థాయికంటే నీటినిల్వ దిగువకు ఉన్నదని, ఈ ప్రాజెక్టు నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ నీటిని తీసుకోవద్దని రెండురాష్ర్టాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలోనే మే తాగునీటి అవసరాల కోసం 6-7 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొన్నది. సిగ్నల్ సమస్య కారణంగా ఏపీ అధికారులు చెప్పిన విషయం సరిగా వినిపించలేదని, దీంతో చర్చకు రాలేదని తెలిపింది. తెలంగాణ ఒప్పుకొంటే సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తానని వెల్లడించింది. దీనిపై తెలంగాణ ఇంకా నిర్ణయం వెల్లడించింది.
పరిధిపై తొందరెందుకు?
కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్తున్నది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరిపాకే బోర్డు పరిధి నిర్ధారించాలని తెలంగాణ మొదటినుంచీ వాదిస్తున్నది. దీనిపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు, అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో వాదనలు వినిపించింది. నీటి కేటాయింపులు జరుపకుండా పరిధి నిర్ణయించడం సరికాదని తెలిపింది. ప్రస్తుతమున్న 46ః66 నిష్పత్తిని 50ః50 నిష్పత్తికి మార్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్రం, కేంద్ర జల్‌శక్తి శాఖ, కేఆర్ఎంబీకి స్పష్టంచేసింది. గతంలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విజ్ఞప్తులను పక్కనబెడుతూ త్వరలో కేఆర్ఎంబీ పరిధిని నిర్ధారించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అదనపు కార్యదర్శి రజత్‌కుమార్ నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో తాజాగా సమీక్షించారు. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తే జరిగే పరిణామాలపై చర్చించారు. ఒకవేళ కేంద్రం కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేస్తే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.